Begin typing your search above and press return to search.

మహమ్మారి వైరస్ ను తట్టుకునే ఒకే ఒక జంతువు.. దానిలో ఫుల్ గా యాంటీబాడీస్

By:  Tupaki Desk   |   15 July 2020 1:00 PM GMT
మహమ్మారి వైరస్ ను తట్టుకునే ఒకే ఒక జంతువు.. దానిలో ఫుల్ గా యాంటీబాడీస్
X
రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటే మానవ శరీరం ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్ ను తట్టుకునే సామర్థ్యం ఉన్నట్టే. ఆ వైరస్ కు మన రోగ నిరోధక శక్తే శ్రీరామరక్షగా పని చేస్తుంటుంది. అలాంటిది పెంచుకుంటేనే మనం ఈ వైరస్ తో పోరాడగలం. అదే విషయాన్ని అన్ని పరిశోధనల్లో తేలింది. అయితే ఆ వైరస్ పై విస్తృత పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ వైరస్ కు విరుగుడుగా మందు కనిపెట్టే క్రమంలో జంతువులపై కూడా పరిశోధనలు చేస్తున్నారు. ఈ సమయంలో లామా అనే జంతువు వారికి తగిలింది. దానిపై పరిశోధన చేయగా మహమ్మారి వైరస్ ను ఎదుర్కొనే యాంటీ బాడీస్ ఆ జంతువులో భారీగా ఉన్నాయని గుర్తించారు. వైరస్ విరుగుడు కనిపెట్టేందుకు ఈ జంతువు ఎంతో ఉపయోగపడవచ్చని భావిస్తున్నారు.

ఇంతకు ఆ జంతువు ఏది.. ఎలా ఉంటుందో తగలుసా. దాని పేరు లామ. చూడ్డానికి ఓ చిన్న సైజు ఒంటెలా.. కంగారూలా కనిపిస్తుంటుంది. ఈ జంతువు దక్షిణ అమెరికా దేశాల్లో అరుదుగా కనిపిస్తుంటాయి. పెరూ, కొలంబియాల్లో కూడా ఉంటాయి. డొమెస్టిక్ యానిమల్‌ గుర్తింపు ఉన్న ఈ లామా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. ఈ పరిశోధనలతో పరిశోధకుల దృష్టి ఆ జంతువుపై పడింది. భయానక వైరస్‌ను నిర్మూలించడానికి అవసరమైన విరుగుడు ఈ జీవిలో ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరే జంతువులోనూ లేని విధంగా లామాలో విభిన్నమైన జీవకణాల నిర్మాణం ఉందని, దాని ద్వారా వైరస్‌కు విరుగుడును కనిపెట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

వైరస్ దాడి చేస్తే సమర్థవంతంగా ఎదుర్కొనే సహజసిద్ధ జీవకణాలు, లక్షణాలు ఆ జంతువు లామాలో మాత్రమే ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ తరహా జీవకణాల నిర్మాణం మరే ఇతర జంతువుల్లో లేదని తేలింది. వైరస్ సోకిన సమయంలో లామా సహజసిద్ధంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ తరహా సూక్ష్మ జీవకణాలను నానోబాడీస్‌గా గుర్తించారు. లామా రక్తకణాలను సేకరించి, దానిపై నిర్వహించిన పరిశోధనల సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని, మహమ్మారి వంటి వైరస్‌ను నిర్మూలించగలిగే సామర్థ్యం వాటికి ఉందని చెప్పారు.

ఈ జంతువు విషయమై రోసాలిండ్ ఫ్రాంక్లిన్ ఇన్‌స్టిట్యూట్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, డైమండ్ లైట్ సోర్స్, పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకుల బృందం టీమ్ నేచర్ స్ట్రక్చరల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ మేగజైన్‌లో ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. లామా జంతువుల్లో కనిపించే నానోబాడీస్ కణాల్లో ఉండే ప్రొటీన్లు మహమ్మారి వైరస్‌ను మానవ రక్తకణాల్లో ప్రవేశించకుండా నిరోధించగలుగుతాయని పేర్కొన్నారు. ఇదే అంశంపై టెక్సాస్‌లోని మెక్‌లెల్లాన్ ల్యాబొరేటరీలో శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలను కొనసాగిస్తున్నారు కూడా. మానవ రక్తకణాల్లోకి లామా నానోబాడీస్‌ను ఇంజెక్ట్ చేసే విషయంపై టెక్సాస్ లాబ్‌లో పరిశోధనలు చేస్తున్నారు.

మానవ రక్తకణాల్లోకి లామా యాంటీబాడీస్, నానోబాడీస్‌లను మిళితం చేసే విషయంపై పరిశోధనలు చేస్తున్నామని, వైరస్ సోకడాన్ని నిరోధించేలా ఇది ఎంత వరకు పని చేయగలుగుతుందనే దిశగా తమ పరిశోధనలు కొనసాగుతున్నట్లు రోసాలిండ్ ఫ్రాంక్లిన్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ స్ట్రక్చరల్ బయాలజీకి చెందిన ఓ ప్రొఫెసర్ తెలిపారు. వైరస్ సోకిన తరువాత.. అది ప్రభావం చూపకుండా ఉండేలా లామాల్లోని నానోబాడీస్ పని చేస్తాయని, వైరస్ స్పైక్స్‌, చైన్‌ను అవి నిర్మూలిస్తాయని తాము గుర్తించినట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ డైమండ్ లైట్ సోర్స్ ప్రొఫెసర్ చెప్పారు.