లక్ష్మీపార్వతి ఎంట్రీ..లోకేశ్ ను ఎంతగా ఏకేశారంటే?

Sun Nov 17 2019 21:50:46 GMT+0530 (IST)

Lakshmi Parvathi Comments on Nara Lokesh

టీడీపీ వ్యవస్థాపకుడు - దివంగత సీఎం నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీపార్వతి... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై విరుచుకుపడ్డారు. వైసీపీ ఆవిర్భావం నుంచే ఆ పార్టీలో కొనసాగుతున్న లక్ష్మీపార్వతికి... పార్టీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే తెలుగు అకాడెమీ అధ్యక్షురాలిగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె చాలా విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానంగా లోకేశ్ ను టార్గెట్ చేసిన ఆమె... సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్బంగా ఆమె ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘ఎన్టీఆర్ భార్యగా ఇతర కుటుంబ సభ్యులు తనను ఎంతో మోసం చేశారు. తనకు ఒక్క పదవి కూడా రాకుండా చేశారు. ఆ మహానుభావుడు స్థాపించిన పార్టీ నేడు దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు పార్టీలోకి కొత్తగా కుక్కమూతి పిందెలు వచ్చాయి. ఆ కుక్కమూతి పిందెకు ఏం తెలుసని పార్టీ లీడర్ గా చేశారు. లోకేశ్ వంటి అయోగ్యుడ్ని పార్టీపై చంద్రబాబు బలవంతంగా రుద్దారు. ఎన్టీఆర్ వంటి మహోన్నత వ్యక్తి స్థాపించిన పార్టీకి లోకేశ్ నాయకుడా? ఈ విషయమై టీడీపీలో ఎంత మంది లోలోపల బాధపడుతున్నారో తమకు తెలుసు. ఎన్నికల ముందు ఈ మనవడే నాపై దారుణమైన నిందను వేసేందుకు ప్రయత్నించాడు.నా వయసును కూడా చూడకుండా 60 ఏళ్లు దాటినదాన్ని అయినా కూడా ఇంత భయంకరమైన నింద వేసి అప్రదిష్ట పాల్జేయాలని చూస్తారా? 30 ఏళ్లప్పుడు లేనిది 60 ఏళ్ల వయసులో ఇంత దారుణమైనది సృష్టించారు. ఇంత నీచానికి పాల్పడినవాళ్లు నా బంధువులని ఎలా చెప్పుకుంటాను. నాకొద్దు వాళ్లతో బంధుత్వం! మనవడు లేడు అల్లుడు లేడు అంటూ ఆమె ఓ రేంజిలో విరుచుపడ్డారు.

మొత్తంగా మొన్నటిదాకా చంద్రబాబును టార్గెట్ చేసుకుని ఓ రేంజి వ్యాఖ్యలు చేసిన లక్ష్మీపార్వతి... ఇప్పుడు లోకేశ్ ను టార్గెట్ గా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్... లోకేశ్ ను టార్గెట్ గా చేసుకుని సంచలనాలకే సంచలనాలుగా నిలిచిన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో వాటిని డిఫెండ్ చేసేందుకు టీడీపీ నానా తంటాలు పడుతోంది. ఇలాంటి నేపథ్యంలో లక్ష్మీపార్వతి కూడా లోకేశ్ ను టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింత సంచలనంగా మారిపోయింది. అంతేకాకుండా లోకేశ్ ను కుక్కమూతి పిందె అంటూ ఆమె చేసిన కామెంట్... టీడీపీ నేతలను ప్రత్యేకించి లోకేశ్ ను ఓ రేంజిలో ఇబ్బంది పెట్టేదనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.