గ్యాస్ బండకు ఇస్తున్న రాయితీ లెక్క తెలిస్తే అవాక్కే

Mon Mar 01 2021 11:00:01 GMT+0530 (IST)

LPG gas cylinder prices hiked

గ్యాస్ బండకు రాయితీ అన్నది పాత మాట. ఇటీవల కాలంలో సబ్సిడీని అంతకంతకూ కోసేస్తున్న కేంద్రం.. ఇప్పుడు సబ్సిడీ అని చెప్పుకోవటానికి సిగ్గుపడేలా అతి తక్కువ మొత్తాన్ని వినియోగదారుల ఖాతాలోకి వేస్తున్న వైనం తాజాగా బయటకు వచ్చింది. గ్యాస్ బండకు నగదు బదిలీ పథకాన్ని షురూ చేసిన వేళలో.. గ్యాస్ బండకు మనం డబ్బులు కట్టేసిన తర్వాత.. మనకు అందాల్సిన సబ్సిడీ మొత్తాన్ని నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేసేవారు. దీంతో.. ఏ వినియోగదారుడికి అందాల్సిన సబ్సిడీ వారికే నేరుగా అందేది.ఇంతవరకు బాగానే ఉన్నా.. గడిచిన కొద్ది నెలలుగా కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలు పలువురిని చిరాకు పెట్టిస్తున్నాయి. ఓవైపు పెట్రోల్.. డీజిల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతూ.. రికార్డు స్థాయికి చేరుకోవటం.. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లీటరు పెట్రోల్ వందను దాటేసిన వైనం తెలిసిందే. డీజిల్ ధర కూడా తొంభైకి దగ్గరకు వచ్చేసిన దుస్థితి. ఇది సరిపోదన్నట్లుగా గ్యాస్ బండ ధరను భారీగా పెంచేశారు.

ఒకప్పుడు ఒక్కోసిలిండర్ పై కనిష్ఠంగా రూ.170.. గరిష్ఠంగా రూ.500 వరకు రాయితీ ఇచ్చే స్థానే.. ఇప్పుడు దారుణంగా పడిపోయిన పరిస్థితి. చాలా ప్రాంతాల్లో గ్యాస్ బండ ఒక్కొక్కదానికి రూ.50 కంటే తక్కువ రాయితీ మొత్తం వినియోగదారులకు అందుతోంది. దీనిపై ఇప్పటికే ప్రజల్లో ఆగ్రహం ఎక్కువ అవుతోంది. ఇదిలా ఉంటే..తాజాగా మరో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. సిలిండర్ రేటును అంతకంతకూ పెంచేస్తున్న ప్రభుత్వం.. రాయితీ మొత్తాన్ని దారణంగా కోత పెట్టేస్తోంది.

ప్రస్తుతం సిలిండర్ ధర విజయవాడలో రూ.816కు చేరితే.. దాని మీద ఇస్తున్న రాయితీ రూ.16కు పడిపోయింది. అదే విశాఖపట్నంలో అయితే అతి దారుణంగా రాయితీ మొత్తానికి కోత పెట్టేశారు. అక్కడ ఒక్కో సిలిండర్ మీద కేవలం రూ.4 మాత్రమే రాయితీగా ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఎక్కడా కూడా రూ.50కు మించని దుస్థితి. వంటగ్యాస్ ధర అత్యధికంగా 2018 నవంబరులో రూ.970 చేరితే.. అప్పట్లో వినియోగదారులకు రాయితీగా రూ.389 ఇచ్చేవారు. 2020 మార్చిలో సిలిండర్ ధర రూ.833 ఉంటే.. రూ.254 రాయితీ కింద ఇచ్చేవారు. ఆ మొత్తం క్రమపద్ధతిలో తగ్గుతూ.. ప్రస్తుతం రూ.16కు పడిపోయింది. ఈ కోతలకు దేనికోమోడీ సర్కారు మాత్రం ఇప్పటివరకు స్పష్టం చేయకపోవటం గమనార్హం.