ప్రముఖ నటి ఖుష్బూకు గట్టి షాకిచ్చారు

Tue Jul 20 2021 20:00:02 GMT+0530 (IST)

Kushboo Twitter Account Got Hacked

నిన్ననే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పార్టీ 'ఎంఐఎం'ను హ్యాక్ చేసిన హ్యాకర్లు తాజాగా ప్రముఖ సీనియర్ నటి బీజేపీ నాయకురాలు ఖుష్బూకు సైతం గట్టి షాక్ ఇచ్చారు. ఆమె ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి పడేశారు.ఖుష్బూకు ఇలా జరగడం రెండోసారి. సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయడం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఆ మధ్య ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలు సైతం హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. ఇక అలాగే బాలీవుడ్ నటి ఈషా దేఓల్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను కూడా హ్యాక్ చేసేశారు.

వీరంతా తమ ఫాలోవర్స్ అంతా జాగ్రత్తగా ఉండాలని.. తన అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్ లకు రిప్లై ఇవ్వొద్దని అభిమానులకు సూచించారు.

తాజాగా హ్యాక్ జాబితాలోకి ప్రముఖ నటి ఖుష్బూ కూడా చేరిపోయారు. ఖుష్బూ ట్విట్టర్ ఖాతాను 'బ్రియాన్'గా హ్యాకర్లు మార్చేశారు. అంతేకాదు.. ట్విట్టర్ లో ఆమె ఫొటోను కూడా మార్చేసి షాకిచ్చారు.ఖుష్బూ పోస్టులన్నీ డిలీట్ కావడం గమనార్హం.

తన ట్విట్టర్ హ్యాక్ అయినట్లు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఖుష్బూ తెలియజేశారు. మూడు రోజుల నుంచి పాస్ వర్డ్ మార్చడానికి ప్రయత్నిస్తుంటే వీలు కావడం లేదని.. ఆ విషయంలో అభిమానులు సాయం చేయాలని ఖుష్బూ కోరారు.

ట్విటర్ నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని ఖుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు. సాయం అందించకపోగా.. తన అకౌంట్ ను సస్పెండ్ చేస్తామని ట్విట్టర్ హెచ్చరిస్తోందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలేం జరుగుతుందో తనకు తెలియదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యను ఎవరైనా పరిష్కరించాలని కోరింది.