Begin typing your search above and press return to search.

పిచ్చోళ్లు అంటూ సింగిల్ పంచ్ తో అదరగొట్టేసిన కేటీఆర్

By:  Tupaki Desk   |   26 Nov 2020 12:10 PM GMT
పిచ్చోళ్లు అంటూ సింగిల్ పంచ్ తో అదరగొట్టేసిన కేటీఆర్
X
రాజకీయాలన్నాక మొహమాటాలు అస్సలు ఉండకూడదు. ఆ మాటకు వస్తే.. కరణ.. జాలి అన్న మాటలకే అవకాశం ఇవ్వకూడదు. ఎంత కఠినంగా ఉంటే అంతలా రాజకీయాల్లో ఎదుగుతారని చెబుతారు. అధికారంలోకి వచ్చిన అధినేత తీరుచూస్తే.. వారు ఆ స్థాయికి ఎదిగే సమయంలో అనుసరించిన విధానాల్ని చూస్తే.. విషయం ఇట్టే అర్థమైపోతుంది. నిన్నమొన్నటి వరకు మిత్రుడే అయినా మారిన సమీకరణాల నేపథ్యంలో మిత్రుడ్ని.. ప్రత్యర్థిగా ప్రకటించటమేకాదు.. అవసరమైతే ఏ మాట అనేందుకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తున్న మంత్రి కేటీఆర్ తీరు చూస్తే.. కీలకమైన ఎన్నికల వేళ.. రైట్ ట్రాక్ లో నడుస్తున్నారనే చెప్పాలి.

రోటీన్ రాజకీయ నేతలకు భిన్నంగా మజ్లిస్ అధినేత తీరు కాస్త భిన్నమని చెప్పాలి. తమ ప్రయోజనాల కోసం ఎవరినైనా సరే.. మాట అనేందుకు వారు అస్సలు మొహమాటపడరు. ముందు అయితే మాట అనేస్తారు. తర్వాత ఏం చేయాలో చేస్తారు. ఇప్పటివరకు ఇలాంటి తీరును ప్రదర్శించిన మజ్లిస్ కు.. తాజాగా మంత్రి కేటీఆర్ కొత్త అనుభవాన్ని మిగిల్చారు. తమకు మాదిరే తమ మిత్రుడు కూడా అన్న విషయాన్ని వారికి అర్థమయ్యేలా కేటీఆర్ చేశారని చెప్పాలి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నోటి నుంచి పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ మాట రావటం.. దానికి ఘాటు కౌంటర్ వేసే క్రమంలో.. హుస్సేన్ సాగర్ సమీపంలోని ఎన్టీఆర్.. పీవీ ఘాట్ లను కూల్చాలంటూ అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చేయటం.. అదే జరిగితే.. గంటలో దారుస్సలాం కూల్చేస్తామని బండి సంజయ్ రియాక్టు కావటం తెలిసిందే.

ఇలాంటివేళ.. ఈ హీట్ వ్యాఖ్యలకు తనమైన శైలిలో సింగిల్ పంచ్ వేసి.. ఈ మొత్తం ఆటలో తనదే పైచేయి అన్న విషయాన్ని అర్థమయ్యేలా చేశారు మంత్రి కేటీఆర్. ఈ క్రమంలో తన మిత్రుడు అక్బరుద్దీన్ ను పిచ్చోడు అనేందుకు వెనుకాడలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తామేమిటో చూపిస్తామని టీఆర్ఎస్ అధినాయకత్వానికి అక్బరుద్దీన్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో.. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోనట్లుగా ఉన్న కేటీఆర్.. బండి సంజయ్.. అక్బరుద్దీన్ ఇద్దరిని కలిపి.. ‘పిచ్చోళ్లు’ అంటూ తేల్చేయటం గమనార్హం.

పిచ్చోళ్ల మధ్య పరేషాన్ కావొద్దు.. ఒకడు సర్జికల్ స్ట్ట్రైక్ లు.. చలాన్లు అంటాడు.. ఇంకొకడు పీవీ.. ఎన్టీఆర్ ఘాట్లు కూలుస్తానంటడు.. వరదలొస్తే ఢిల్లీ నుంచి ఒక్కడూ రాలే.. ఎన్నికలనగానే డజన్ల కొద్దీ దిగుతున్నారంటూ పేర్కొన్నారు. వాళ్లేమో గుంపులుగా వస్తుంటే.. సీఎం మాత్రం సింగిల్ గానే ఉన్నారంటూ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల వేళలో పిచ్చిలేసినట్లుగా మాట్లాడుతున్నారని.. ప్రశాంతమైన హైదరాబాద్ లో చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. మొత్తంగా భావోద్వేగాల్ని టచ్ చేసేలా మాట్లాడుతున్న ఇద్దరుకీలక నేతల్ని ఉద్దేశించి పిచ్చోళ్లు అన్న ముద్ర వేయటం ద్వారా కేటీఆర్ తన అధిక్యతను ప్రదర్శించారని చెప్పాలి. ఏమైనా సరైన సమయంలో సరైన పంచ్ సింగిల్ గా వేసి.. ఇద్దరు ముఖ్యనేతలకు షాకిచ్చారని చెప్పక తప్పదు.