Begin typing your search above and press return to search.

టేబుల్ టాప్ ఓకే.. ఏమిటీ ఓవర్ షూట్?

By:  Tupaki Desk   |   9 Aug 2020 4:30 PM GMT
టేబుల్ టాప్ ఓకే.. ఏమిటీ ఓవర్ షూట్?
X
దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం కోజికోడ్ విమానాశ్రయంలో దారుణ ప్రమాదానికి గురి కావటం.. పలువురు మరణించటం తెలిసిందే. కాస్త ఆలస్యంగా పైలెట్ ప్రదర్శించిన సమయస్ఫూర్తి వెలుగు చూసింది. విమానంలోని ప్రయాణికులు ప్రాణాలతో నిలవటానికి పైలెట్ పుణ్యమేనన్న విషయం ప్రపంచానికి అర్థమైంది. విమానాశ్రయ డిజైన్ ఏ మాత్రం సరికాదని.. ప్రమాదాలకు కారణమవుతుందన్న విషయాన్ని పదేళ్ల క్రితమే గుర్తించినా.. అందుకు తగ్గ చర్యలు తీసుకోకపోవటమే తాజా ప్రమాదానికి కారణంగా తేలింది.

విమాన ప్రమాదానికి కారణం టేబుల్ టాప్ అన్న విషయంపై ఎవరికి ఎలాంటి సందేహాలు లేకున్నా.. మరికొన్ని సాంకేతిక అంశాలు కూడా ఈ ప్రమాదం చోటు చేసుకోవటానికి కారణంగా మారాయని చెబుతున్నారు. సాధారణంగా టేబుల్ టాప్ రన్ వేల మీద ల్యాండింగ్ నిర్ణీత ప్రదేశాన్ని దాటి ముందుకు వెళితే.. .ఆ విమానం లోయలాంటి ప్రదేశానికి వెళ్లిపోతుంది.

వర్షం.. దానికి తోడు వెలుగు సరిగా లేకపోవటం లాంటి కారణాలతో విమానాన్ని నిర్దిష్టంగా ఎక్కడైతే ల్యాండ్ చేయాలో అక్కడ ల్యాండ్ చేయకపోవటం కూడా తాజాప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. వర్షం కారణంగా విమానం ల్యాండ్ అయ్యే సమయానికి ఆక్వాఫ్లైనింగ్ పరిస్థితి తలెత్తి ఉండొచ్చాన్నారు. తాజా ప్రమాదం ఒక్క కారణంతోనే చోటు చేసుకోదని చెప్పాలి. పలు సాంకేతిక అంశాలు ప్రమాదంతో ముడిపడి ఉంటాయని చెప్పక తప్పదు.

కోజికోడ్ ప్రమాదం తర్వాత టేబుల్ టాప్ విమానాశ్రయాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరగటం తెలిసిందే. తాజాగా ఓవర్ షూట్ అన్న మాట తెర మీదకు వచ్చింది. ప్రమాదానికి ఈ సాంకేతిక తప్పిదం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. సాధారణంగా ఏ విమానాశ్రయంలో అయినా.. విమానాన్ని ఎక్కడ ల్యాండ్ చేయాలో మార్కు చేసి ఉంచుతారు. అక్కడ నేలను తాకిన తర్వాత.. విమానం తన వేగాన్నితగ్గించుకొని నిలవటానికి కాస్త దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మామూలు రోజుల్లో ఈ మార్కు వద్ద సరిగ్గా ల్యాండ్ అవుతుంది.కానీ.. వర్షం లాంటి సందర్భాల్లో ఇలాంటివి సాధ్యం కావు.

తాజాగా చోటు చేసుకున్న ప్రమాదాన్ని చూస్తే.. విమానం ల్యాండ్ కావాల్సిన ప్రదేశానికి దాదాపు కిలో మీటరు ముందుకు వెళ్లి నేలను తాకటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. నేలను తాకిన తర్వాత విమానం ముందుకు వెళ్లటం.. అందుకు అవసరమైన అదనపు రన్ వే లేకపోవటంతో లోయలోకి వెళ్లిపోయింది. వాస్తవానికి అక్కడ అదనపు రన్ వే 200 మీటర్లు ఉండాల్సి ఉండగా.. 90 మీటర్లు మాత్రమే ఉండటం కూడా ప్రమాదానికి కారణమైందిని విశ్లేషిస్తున్నారు. ఇక.. ఆక్వాప్లైనింగ్ కూడా కారణమన్న మాటను చూస్తే.. నీరు ప్రవహిస్తున్న నేల మీద వేగంగా వెళుతున్న కారుకు సడన్ బ్రేక్ వేస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో.. విమానానికి అలాంటి పరిస్థితే ఉంటుంది. టేబుల్ టాప్ రన్ వే.. భారీ వర్షం..వెలుగు సరిగా లేని కారణంగా రన్ వే సరిగా కనిపించకపోవటం.. ఓవర్ షూట్ కు ఆక్వాప్లైనింగ్ తోడు కావటంతో ఘోర ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తే.. మరింత స్పష్టంగా ప్రమాదానికి కారణం ఏమిటో అర్థమయ్యే అవకాశం ఉంది.