Begin typing your search above and press return to search.

టీడీపీ వద్దంటే వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యే దారి ఇదేనా?

By:  Tupaki Desk   |   7 Feb 2023 6:00 AM GMT
టీడీపీ వద్దంటే వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యే దారి ఇదేనా?
X
ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలతో తన సొంత పార్టీ ప్రభుత్వంపై నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఫోన్‌ ట్యాపింగ్‌ తో తాను 11 సిమ్‌ కార్డులు మార్చాల్సి వచ్చిందన్నారు. మరోవైపు కోటంరెడ్డి విమర్శలతో వైసీపీ అధిష్టానం నెల్లూరు రూరల్‌ ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పించి నెల్లూరు ఆదాల ప్రభాకరరెడ్డిని ఇంచార్జిని చేసింది.

ఈ నేపథ్యంలో ఒక టీవీ చానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అనేక విషయాలను వెల్లడించారు. చంద్రబాబు, లోకేష్‌ సీటు ఇస్తే నెల్లూరు రూరల్‌ నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తానన్నారు. నెల్లూరు జిల్లాలో పది సీట్లలో టీడీపీని గెలిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు. టీడీపీ సీటు ఇవ్వకపోతే బీజేపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీల తలుపు తడతానన్నారు. వారు కూడా వద్దనుకుంటే తమిళనాడు వెళ్లి స్టాలిన్‌ ను కలుస్తానన్నారు.

ఆ పార్టీ తరఫున పోటీ చేస్తా అని లేదంటే బిహార్‌ వెళ్లి ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్‌ ను కలుస్తానన్నారు. అది కూడా కుదరకపోతే యూపీకి వెళ్లి అఖిలేష్‌ యాదవ్‌ ను కలుస్తానని.. ఆ పార్టీలో చేరి సమాజవాదీ టికెట్‌ పై ఏపీలో పోటీ చేస్తానన్నారు. అక్కడ కూడా సీటు ఇవ్వకపోతే మాయావతిని కలసి బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతిని కలుస్తానన్నారు. ఆ పార్టీ జెండాను తన కారుకు కట్టుకుని తిరుగుతానని చెప్పారు.

తాను రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక అధికార మదంతో కొంతమందిని దూషించిన సంగతి నిజమేనని కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఒప్పుకున్నారు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని వారి ఇళ్లకు వెళ్లి మరీ క్షమాపణలు చెప్పి వచ్చానన్నారు.

వైఎస్‌ జగన్‌ ను తాను ఎంతో ప్రేమించానని, ఆరాధించానని కోటంరెడ్డి శ్రీధరరెడ్డి తెలిపారు. తాను వేరే పార్టీలోకి వెళ్లినా జగన్‌ పైన ఎలాంటి విమర్శలు చేయబోనన్నారు. ఇప్పుడు జగన్‌ తనను ఏం చేయకుండా వదిలేసినా ఆయన చుట్టు ఉండే శక్తులు తనను చూస్తూ ఊరుకోబోవన్నారు.

వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో అంతకంటే 100 రెట్లు తనను కూడా ఇబ్బంది పెడతారని తనకు తెలుసని కోటంరెడ్డి శ్రీధరరెడ్డి వ్యాఖ్యానించారు. నిజాయతీగా ఉండాలనే, నమ్మక ద్రోహం చేయకూడదనే ఇంకా అధికారం 15 నెలలు ఉండగానే ముందే తాను వైసీపీ నుంచి తప్పుకున్నానన్నారు.

పాదయాత్ర చేస్తూ నెల్లూరులో వరదల్లో చిక్కుకున్న అమరావతి రైతులకు తాను మానవతా దృక్పథంతో సాయం చేసినప్పటి నుంచి తనను టార్గెట్‌ గా చేసుకున్నారని వాపోయారు. ఈ విషయంపైన వైఎస్‌ జగన్‌ తనను అడిగారని.. అమరావతి రాజధానికి తాను మద్దతు తెలపలేదని జగన్‌ కు వివరించానన్నారు. పాదయాత్ర చేస్తూ నెల్లూరు వరదల్లో చిక్కుకున్న వారికి సాటి మనిషిగా సాయం చేశానన్నారు.

తన ఫోన్‌ ట్యాపింగ్‌ కు గురవుతోందని నాలుగు నెలల క్రితమే ఒక జూనియర్‌ ఐపీఎస్‌ ఫోన్‌ చేసి హెచ్చరించారని చెప్పారన్నారు. అయితే ఆ విషయాన్ని తాను నమ్మలేదన్నారు. జగన్‌ తో సరిపడక ఆయన మీద ఏదో అభాండం వేయాలనే తన దగ్గర చెబుతున్నానని అనుకున్నానన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ఆధారాలతో సహా తెలిశాకే ఇక ఆ పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకున్నానన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.