Begin typing your search above and press return to search.

జగన్ తో కోటం రెడ్డి భేటీ అప్పుడేం జరిగింది?

By:  Tupaki Desk   |   6 Feb 2023 7:00 PM GMT
జగన్ తో కోటం రెడ్డి భేటీ అప్పుడేం జరిగింది?
X
ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడో హాట్ టాపిక్. వైసీపీ మార్కుకు నిలువెత్తు రూపంగా ఉండే ఆయన.. ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వైనం రాజకీయ కలకలానికి కారణమైందని చెప్పాలి. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కానట్లుగా పరిస్థితులు మారాయి.

మైకు ముందుకు వచ్చి.. కోటంరెడ్డి మాట్లాడటం మొదలు పెడితే వైసీపీ నేతల్లో వణుకు పుట్టే పరిస్థితి తాజాగా నెలకొంది. విషయం ఏదైనా.. ప్రశ్న మరేదైనా అడగటమే ఆలస్యం.. ఠక్కున చెప్పేస్తున్నారు. అలా ఆయన చెబుతున్న మాటలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీయటమే కాదు.. అప్పట్లో ఇంత జరిగిందా? అన్న వాదన వినిపిస్తోంది.

తాజాగా ఒక ప్రముఖ మీడియాసంస్థకు చెందిన అధినేతకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు సంచలన అంశాల్ని ఆయన బయటపెట్టారు.

జనవరి 2న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాంపుకార్యాలయంలోక లిసిన సందర్భంలో ఏమైంది? సీఎం జగన్ తనతో ఏం మాట్లాడారు? లాంటి వివరాలతో పాటు.. తన ఫోన్ ట్యాప్ ఉదంతంపైనా ఆయన రియాక్టు అయ్యారు.

ఇంటర్వ్యూలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పిన అంశాల్లో కీలకమైనవి చూస్తే..

- జనవరి 1న ముఖ్యమంత్రిని కలవాలని కబురు వచ్చింది. జనవరి 2న వెళ్లి కలిశా. ఏం శ్రీధర్.. విషయాలు ఏమిటి? అని అడిగారు. మీరు చెప్పిన కొన్ని జీవోలు వచ్చినా.. ఆర్థికపరమైన అనుమతులు రాలేదు. కొన్ని జీవోలు అస్సలే రాలేదని చెప్పా. వెంటనే ధనుంజయ్ రెడ్డిని పిలిచి..తొందరగా చేయాలని చెప్పారు. ఎంత లోపు అవుతాయని అడిగితే.. నెల రోజులు అని ధనుంజయ్ రెడ్డి చెప్పారు. నెల అయినా అతీగతీ లేదు.

- ఫోన్ ట్యాపింగ్ గురించి అడగలేదు. ఎందుకంటే చేతుల్లో ఆధారాల్లేవు. అప్పటికి నేను జగన్ భక్తుడినే. అందుకే మాట్లాడలేదు. నాలుగు నెలల క్రితం ఒక జూనియర్ ఐపీఎస్ అధికారి నాకు ఫోన్ చేశాడు. మీ ఫోన్ ట్యాపింగ్ జాబితాలో ఉంది జాగ్రత్త అని చెబితే నేను నమ్మలేదు. పార్టీ పరంగా నేను సవాళ్లు విసరను కదా? నా ఫోన్ ట్యాపింగ్ లో పెట్టటం ఏమిటి? అని అడిగితే.. అవన్నీ నాకు తెలీదు.. మరో గంటలో మీ ఫోన్ ట్యాపింగ్ లోకి వెళుతుందని చెప్పారు. సదరు అధికారి జగన్ వద్దకు ఏదైనా పనికి వెళితే చేసి ఉండకపోవచ్చు. సీఎంకు నేను దగ్గర కాబట్టి ఒక రాయి జగన్ నెత్తిన వేశారేమో అనుకున్నా. తర్వాత నెల ముందు నిఘా విభాగం డీజీ సీతారామంజనేయులు వారి సెల్ నుంచి నా సెల్ కు ఆడియో పంపారు. నేను మళ్లీ ఫోన్ చేస్తే.. తాము ట్యాపింగ్ చేయలేదన్నారు. దానికి నేను బదులిస్తూ.. మీరెందుకు సార్ భుజాలు తడుముకుంటున్నారు. మీరు ట్యాప్ చేశారని నేనన్నానా? ఆ వాయిస్ నాదే అని ఆయనతో అన్నా.

- జగన్ ను ఒక నాయకుడిగా మాత్రమే కాదు.. ఒక నెల్సన్ మండేలాలా.. చేగువేరాలా.. భగత్ సింగ్ లా.. సుభాష్ చంద్రబోస్ లా.. ఒక చంద్రశేఖర్ అజాద్ లా ఆరాధించా. తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే.. జగన్ నన్ను ఎమ్మెల్యేను చేశారన్నట్లుగా ఆరాధించాను.

- గెలిచిన మొదటి మూడు నెలల్లో కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మనం ఇలా అధికార మదం ఎక్కించుకోకూడదని నాకు నేనే ఆత్మపరిశీలన చేసుకున్నా. నా కారణంగా బాధ పడిన వారికి అప్పట్లోనే వారింటికి వెళ్లి క్షమాపణలు చెప్పి వచ్చా. మిగిలిన వారికి క్షమాపణలు చెబుతున్నా.

- నాకు బాలినేని.. కొడాలి నాని..పేర్ని నానితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ పిలిచి ఇది నువ్వు మాట్లడాలని చెబితే మాట్లాడక తప్పదు కదా? ఎవరైనా మాట్లాడతారుకదా? మా పార్టీకి చెందిన 30-35 మంది ఎమ్మెల్యేలు.. ఇద్దరు మంత్రులు.. నలుగురు ఎంపీలు నాకు ఫోన్ చేసి మా ఫోన్లు కూడా ట్యాపింగ్ జరుగుతున్నాయి. నువ్వు బయటపడ్డావు. మేం బయటపడటం లేదని చెప్పారు. ట్యాపింగ్ విషయాన్ని వదిలేది లేదు.

- అధికార పార్టీకి దూరమైతే ఏం జరుగుతుందో తెలియని అమాకుడ్ని కాదు. బలిపీఠం ఎక్కుతానా? అమరుడిని అవుతానా? వీరుడిని అవుతానా? అన్నింటికి నేను సిద్ధం. పోనీలే పాపం.. మన శ్రీధర్ మనతో కష్టాల్లో ున్నాడు. నాయనకు దగ్గరగా ఉన్నాడు. ఏదో దూరంగా జరిగాడులే.. వదిలేద్దామని జగన్ అనుకున్నాపక్కనున్న శక్తులు మౌనంగా ఉండే ప్రశ్నే లేదు. జగన్ ను ఎంతో ప్రేమించా.. ఆరాధించా. నాకిలా జరిగి ఉండకూడదనుకుంటున్నా. ఆయనపై నాకున్న బాధ కసిగా మారకూడదని కోరుకుంటున్నా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.