అమెరికాకు చాలెంజ్ విసిరిన కొరియా

Mon Sep 13 2021 17:36:05 GMT+0530 (IST)

Korea throws challenge to America

ఉత్తర కొరియా అగ్రరాజ్యం అమెరికాకు ఛాలెంజ్ విసిరింది. తాజాగా మధ్యశ్రేణి క్రూయిజ్ క్షిపణిని మొట్టమొదటిసారిగా ప్రయోగించింది. ఈ క్షిపణి 1500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ ను కచ్చితంగా ఛేదించగలుగుతుంది. అంటే ఉత్తరకొరియా నుండి ఈ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగిస్తే జపాన్ లో పేలుతుంది అనుకోవచ్చు. ఇది మామూలుగానే పెద్ద విధ్వంసాన్ని సృష్టిస్తుంది. దీనికి గనుక అణువార్ హెడ్ ను ఎటాచ్ చేస్తే ఇక ఇది చేసే విధ్వంసాన్ని ఊహించటం కూడా కష్టమే.ఎప్పుడైతే ఉత్తర కొరియా ఈ క్షిపణిని ప్రయోగించిందో వెంటనే అమెరికా గోల చేయడం మొదలుపెట్టింది. క్షిపణిని తయారుచేయడం ప్రయోగాత్మకంగా ప్రయోగించటం ఎంతమాత్రం ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం తప్పు కాదు. కానీ ఓ దేశం అణ్యాయుధాలు కలిగిఉండటం మాత్రం కచ్చితంగా పొరుగుదేశాలకు ఆందోళన కలిగించేదే అనటంలో సందేహంలేదు. అయితే తమ ప్రయోగాల విషయమై ఉత్తరకొరియా అధికారులు మాట్లాడుతు ఎవరిపైనా దాడులు చేసే ఉద్దేశ్యం తమకు లేదని కాకపోతే శతృవుల దాడుల నుండి రక్షించుకునేందుకే తాజా క్షిపణిని రూపొందించినట్లు చెప్పారు.

ఉత్తర కొరియాతో శాంతి చర్చల కోసం అమెరికా జపాన్ దక్షిణ కొరియా దేశాల ప్రతినిధులు మంగళవారం టోక్యోలో కీలకమైన సమావేశం జరగబోతోంది. ఆ సమావేశానికి ఒక్కరోజు ముందు క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించటం యాధృచ్చికమా లేకపోతే హెచ్చరిక సంకేతాలు అన్నదే తెలియటంలేదు. ఒకవైపేమో ఐక్యారాజ్యసమితి ఆంక్షల ఫలితంగా చాలా దేశాలు ఉత్తరకొరియాకు ఏ విధంగా కూడా సహకరించడం లేదు. దీంతో ఉత్తర కొరియా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమై పోయింది.

ఒకవైపు ఆర్ధికంగా దేశ పరిస్థితి దెబ్బతిన్నా కూడా ఆయుధాల ప్రయోగాలు అణ్వాయుధ ప్రయోగాల విషయంలో దేశాధ్యక్షుడు నియంత కిమ్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ విషయంలోనే దాయాది దేశం దక్షిణ కొరియా అమెరికాలో ఆందోళన పెరిగిపోతోంది. తన శత్రుదేశాల వద్ద ఆయుధాలు ఎంతగా పెరిగిపోతే అమెరికాలో అంత టెన్షన్ పెరిగిపోతుంది. తమపై ఎన్ని ఆంక్షలు విధించినా ఎవరినీ లెక్కచేసేది లేదన్న పద్దతిలోనే కిమ్ వ్యవహారాలు కంటిన్యూ అవుతున్నాయి. ఏ దేశంతోనే సరే సవాలనే పద్దతిలోనే కిమ్ డైలాగులుంటాయి. అందుకనే తాజా క్షిపణి ప్రయోగం సంచలనంగా మారింది.