సొంత పార్టీ ఓడిపోవడమే.. కాంగ్రెస్ సీనియర్ లక్ష్యమా?

Thu Jul 29 2021 16:19:14 GMT+0530 (IST)

Komatireddy survey in Huzurabad

ఎన్నికల ముందు ఏ పార్టీ నాయకుడైనా ఏం చెబుతాడు? తమ పార్టీ బంపర్ మెజారిటీతో గెలవబోతోందని చెబుతారు. ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా రావని చెబుతారు. కానీ.. తమ పార్టీ గెలవనే గెలవదని అంటున్నాడంటే అర్థమేంటీ..? తమ పార్టీకి డిపాజిట్ కూడా రాదని చెబుతున్నాడంటే.. ఆశిస్తున్నదేంటీ? ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లో సాగుతున్న చర్చ. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఐదు శాతం ఓట్లు కూడా రావంటూ కాంగ్రెస్ సీనియర్ నేతగా చెప్పుకునే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. తాను సర్వే చేయించానని ఈ సర్వే ప్రకారం.. హస్తం పార్టీకి 5 శాతం మించి ఓట్లు రావని చెప్పారు. దీంతో.. కాంగ్రెస్ శ్రేణుల్లో హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. కోమటిరెడ్డి తీరుపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు సార్లు అధికారానికి దూరమైంది. మళ్లీ తిరిగి లేవొద్దు అన్నట్టుగా తొక్కేసింది కాంగ్రెస్. ఈ గ్యాప్ ను చక్కగా వినియోగించుకున్న బీజేపీ.. తామే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటోంది. మరి ఇలాంటి సమయంలో సీనియర్లుగా ఉన్నవారు ఎలాంటి పాత్ర పోషించాలి..? యువతరాన్ని ముందు పెట్టి.. తమ అనుభవాన్ని ఉపయోగించి పార్టీలో జవసత్వాలు నింపేందుకు కృషిచేయాలి. కానీ.. హస్తం పార్టీలో సీనియర్లుగా ఉన్నవారు.. పార్టీ ఓడిపోతుందని చెప్పడం వారి ప్రవర్తనకు అద్దం పడుతోందని సాక్షాత్తూ కాంగ్రెస్ కార్యకర్తలే మండిపడుతున్నారు.

కేవలం తనకు పీసీసీ చీఫ్ ఇవ్వలేదనే కారణంతోనే కోమటిరెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. రేవంత్ కు బాధ్యతలు అప్పగించడం తట్టుకోలేకనే.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని రేవంత్ వర్గం అనుమానిస్తోంది. పార్టీలో అంతర్గత అంశాలు ఏవి ఉన్నా.. సమావేశాల్లో మాట్లాడుకోవాలే తప్ప.. ఎన్నిక ముందు ఇలాంటి కామెంట్లు చేయడం ద్వారా ప్రజలకు పార్టీ కార్యకర్తలకు కోమటిరెడ్డి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని ప్రశ్నిస్తున్నారు.

రేవంత్ రెడ్డికి పీసీసీ ఖరారైన తర్వాత వ్యతిరేకంగా స్పందించిన నేత కేవలం కోమటిరెడ్డి మాత్రమే. తెలంగాణ కాంగ్రెస్ కూడా టీటీడీపీగా మారిపోతుందంటూ తన ఆక్రోశం వెల్లగక్కారు. ఆ తర్వాత బీజేపీ మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తూ.. ఊహాగానాలకు అవకాశం ఇచ్చారు. అనంతరం షర్మిల పార్టీ నుంచి తనకు ఆహ్వానం ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు..  హుజూరాబాద్ లో తాను సర్వే చేయించానని అందులో కాంగ్రెస్ ఓడిపోతుందని అది కూడా 5 శాతానికి మించి ఓట్లు రావాని చెప్పుకొచ్చారు. దీంతో.. హస్తం పార్టీలో కోమటిరెడ్డి తీరుపై గట్టిగానే చర్చ జరుగుతోంది.

పార్టీ విజయానికి ఏం చేయాలో.. ఎలా చేయాలో చెప్పడం వదిలేసి.. ఓడిపోతుందని వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ద్వారా కేడర్ స్థైర్యం దెబ్బతీస్తున్నారని రేవంత్ వర్గం మండిపడుతోంది. హుజూరాబాద్ లో డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ చేశారు కోమటిరెడ్డి. దాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతోనే.. తద్వారా రేవంత్ అకౌంట్లో ఒక మచ్చ వేయాలనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నిభేదాభిప్రాయాలున్నా.. ఎన్నికల సమయంలో అందరం ఒకేటనని కదా ముందుకు సాగాల్సింది? అప్పుడే కదా.. కేడర్ జోష్ గా ముందుకు కదిలేది? ఈ జోరు కొనసాగిస్తేనే కదా.. జనాల్ని ఆకర్షించేది? అప్పుడే కదా.. అధికారం హస్తగతం అయ్యేదీ? ఇలాంటి.. కీలక సమయంలో ఏకతాటిపైకి రావడం వదిలేసి.. అసమ్మతి గళం వినిపించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రెండు సార్లు అధికారం కోల్పోయిన ఈ తరుణంలో కూడా పార్టీ సీనియర్లు కీచులాటలు వదలకపోవడం పట్ల రాజకీయ పరిశీలకులకు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ ప్రమాణ స్వీకారం తర్వాత ఒకతాటిపైకి వచ్చినట్టు అనిపించినప్పటికీ.. మళ్లీ పాతకథే అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మరి దీనికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఏం సమాధానం చెబుతారో?