కోమటిరెడ్డి ఇక చేసేదేమీ లేదు...గమ్మున ఉంటే బెటర్...?

Sun Aug 14 2022 16:05:29 GMT+0530 (India Standard Time)

Komatireddy Venkatreddy In Congress

తెలంగాణా కాంగ్రెస్ లో కోమటి రెడ్డి  హవాకు ఇక చెక్ పడినట్లే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మిగిలిన పార్టీలకు భిన్నం అక్కడ స్వేచ్చ ఎక్కువ. అలాగని తెగే దాకా లాగితే నష్టపోయేది కూడా నోరున్న నాయకులే. అతి స్వేచ్చను తాము అనుభవించడం వరకూ ఓకే కానీ దాన్ని అడ్డంగా పెట్టి ఏకంగా పార్టీ పరువు తీయాలనుకుంటే మాత్రం అసలుకే ఎసరు రావడం ఖాయం. ఇపుడు తెలంగాణాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి అలాగే ఉంది.మాట్లాడితే తాను 34 ఏళ్ళ బట్టి కాంగ్రెస్ లో ఉన్నాను సీనియర్ నేతను అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకుంటున్నారు. కానీ ఆయన కాంగ్రెస్ వల్లనే గెలుస్తున్నారు. సొంత పలుకుబడి ఉంటే అది కొంత మాత్రమే. కాంగ్రెస్ అనే చెట్టు నీడను ఎదిరి తానే పార్టీ కంటే పెద్ద అంటే ఎలా కుదురుతుంది. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోపం ఉంటే ఉండవచ్చు. ఆయన తన కంటే వయసులో చిన్న కాంగ్రెస్ లో సీనియారిటీలో చిన్న అయినా సరే పీసీసీ చీఫ్ అయిపోయారు అన్న బాధ ఉండవచ్చు.

కానీ రేవంత్ రెడ్డికి ఫాలోయింగ్  ఉంది. యూత్ లో ఇమేజ్ ఉంది. కేసీయార్ ని గట్టిగా ఎదుర్కోగలడు అని అంతా నమ్ముతారు. ఆయన ఏ రోజునా కూడా కేసీయార్ విషయంలో రాజీ పడలేదు. పైగా పొలిటికల్ గా గ్లామర్ ఉన్న వాడు. వాగ్దాటి ఉంది. మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే ఆయన్ని ఏరి కోరి  తెచ్చి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ చేసింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఎంపిక తప్పు అంటే కాంగ్రెస్ అధినాయకత్వం తప్పు చేసినట్లుగా వెంకటరెడ్డి భావిస్తున్నారా అన్నది కూడా ఆలోచించాలి.

అంతే కాదు కోమటిరెడ్డి బ్రదర్స్ కి చాలా వ్యాపారాలు ఉన్నాయి. అందుకే వారు రాష్ట్రంలో కేసీయార్ తో కేంద్రంలోని బీజేపీ వారితో సన్నిహితంగా ఉంటారని అంతా అనుమానిస్తారు. మరి అలాంటి రాజీలు పేచీ పూచీలు  ఏవీ రేవంత్ కి లేవు అనే అంతా అంటారు. మరో విషయం ఇక్కడ ఉంది. కోమటిరెడ్డి ఇప్పటికే రచ్చ చాలా చేశారు. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మీద మమకారం ఉంటే ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు.

అయితే ఉన్న పార్టీలో గొడవ చేసి దాని ద్వారా మరింత రాజకేయ లాభం పొందుదామనుకుంటే మాత్రం అది బూమరాంగ్ అవుతుంది. తన మీద అనుచిత కామెంట్స్ అద్దంకి దయాకర్ అనే దళిత  నేత చేశారన్న దాని మీద కోమటిరెడ్డి అలిగితే ఆయన డిమాండ్ మేరకు పెద్ద మనసుతో ఇప్పటికే రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఒక విధంగా రేవంత్ చేసింది మంచి పని. వ్యూహాత్మకంగా కూడా అది బాగా తగినది.

ఈ దెబ్బకు కోమటిరెడ్డికి ఏమనాలో కూడా అర్ధం కాని పరిస్థితి లోకి వెళ్ళారనుకోవాలి.  అయినా సరే అద్దంకి దయాకర్ మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికి రెండు సార్లు దయాకర్ కూడా సారీ చెప్పారు. అయినా సరే యాగీ చేయడం వల్ల వెంకటరెడ్డే పలుచన అవుతారు అన్నది ఆలోచించుకోవాలి. ఒక దళిత నేత సారీ చెప్పినా క్షమించే గుణం లేకపోతే రేపటి రోజున దళిత సామాజికవర్గం దృష్టిలో కూడా ఆయన విలన్ గా మారే ప్రమాదం ఉంటుంది.

ఏది ఏమైనా వెంకటరెడ్డి ఒకందుకు రాజకీయం చేశారు. కానీ ఇపుడు అది రివర్స్ అయింది. ఇదంతా ఆయన తనకున్న దాన్ని ఎక్కువగా ఊహించుకుని అతి చేయడం వల్లనే. ఏది ఏమైనా ఇప్పటికి వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టి పెద్ద మనిషిగా ఉంటే ఆయనకే మంచిది. మిత్రులు  హితులు అయిన వారు కూడా చెప్పే మాట ఒక్కటే కోమటిరెడ్డి ఇక మీదట గమ్మున ఉండు అనే. మరి ఆయన ఇంకా రచ్చ చేయాలనుకుంటే మాత్రం కోరి ఇబ్బందులు తానుగా తెచ్చుకున్నట్లే మరి.