Begin typing your search above and press return to search.

గళం విప్పిన కోమటిరెడ్డి.. దూరంగా ఎందుకు ఉంటున్నారో చెప్పేశారు

By:  Tupaki Desk   |   26 Sep 2021 3:41 AM GMT
గళం విప్పిన కోమటిరెడ్డి.. దూరంగా ఎందుకు ఉంటున్నారో చెప్పేశారు
X
అందరికి పార్టీ గెలవాలని ఉంటుంది. కానీ.. కాంగ్రెస్ నేతలు అందుకు భిన్నం. వారు మాత్రం పార్టీ తమ కారణంగా మాత్రమే గెలవాలని భావిస్తుంటారు. అధికారంలో ఉన్నా లేకుండా అసమ్మతి నీడలా వెంటాడుతూ ఆ పార్టీని తెగ ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. అంతగా నచ్చకుంటే పార్టీ విడిచిపెట్టొచ్చు కదా? అన్న ప్రశ్నకు ఎవరూ బదులివ్వరు. ఎవరి పార్టీ? ఎందుకు విడిచిపెట్టాలన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఇంతా చేస్తే.. తమ మాటలతో పార్టీకి డ్యామేజ్ చేస్తుంటారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన వైనంతో.. కాంగ్రెస్ ఎప్పటికి బాగుపడదన్న మాట అందరి నోటి నుంచి వచ్చాయి.

ఆశ్చర్యకరంగా రెండో రోజుకే భిన్నమైన వాదనను వినిపించిన జగ్గారెడ్డి.. రేవంత్ కు సారీ చెప్పటమే కాదు.. తాను ఇకపై మీడియాకు దూరంగా ఉంటానని పేర్కొనటం గమనార్హం. తాను మాట్లాడిన మాటలకు చెంపలేసుకున్నంత పని చేసిన జగ్గారెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు ఆసక్తికరంగామారింది. రేవంత్ చేపడుతున్న కార్యక్రమాలు.. చేస్తున్న ఆందోళనలు అధికార పక్షం ఉక్కిరిబిక్కిరి అవుతున్న నివేదికలు అందుతున్న వేళలో.. సొంత పార్టీ నేతలే అందుకు భిన్నంగా వ్యవహరించటాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్.. జగ్గారెడ్డి తలంటు పోసిందని.. సీరియస్ హెచ్చరికలు చేసినట్లుగా చెబుతారు. మొత్తానికి తాజా ఎపిసోడ్ తో జగ్గారెడ్డి ఎపిసోడ్ ఒక కొలిక్కి వచ్చిందనుకున్నంతలో నిత్య అసమ్మతి నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గళం విప్పారు. ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న ఆయన తీరు తరచూ హాట్ టాపిక్ గా మారుతోంది.

పీసీసీ చీఫ్..కొత్త కమిటీల నియామకం తర్వాత నుంచి పార్టీకి ఒకింత దూరంగా ఉంటున్న ఆయన.. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి.. విమర్శలు గుప్పించటం ద్వారా తన ఉనికిని చాటుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన తన నియోజకవర్గంలోని ప్రభుత్వ.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం హాజరవుతున్నారు. ఏ మాత్రం అవకాశం చిక్కినా తనకు నచ్చని రాష్ట్ర పార్టీ నాయకత్వంపై విరుచుకుపడుతున్న ఆయన.. తాజాగా మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా తాను పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నానన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. తనకు 'షో' రాజకీయాలు తెలీయమన్న ఆయన.. రెండేళ్లలో ఎన్నికలు వస్తుంటే ఇలానేనా పార్టీ సన్నద్ధత అంటూ ఫైర్ అయ్యారు. ఈ కారణంతోనే తాను పార్టీ పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ కు వెళ్లలేదన్నారు. సీనియర్లనుసంప్రదించకుండా అధికార ప్రతినిధుల్ని నియమిస్తారా? అన్న ప్రశ్నను సంధించిన ఆయన.. వచ్చే వారం రాహుల్.. ప్రియాంకలను కలిసినప్పుడు ఈ విషయాల్ని చర్చిస్తానన్నారు.

హుజూరాబాద్ ఖాళీ అయి నాలుగున్నర నెలలు అయ్యిందని.. కొత్త పీసీసీ వచ్చి మూడున్నర నెలలు అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షం ఎందుకు రివ్యూ చేయట్లేదన్న ఆయన.. హుజూరాబాద్ కు పీసీసీ నేతలు ఎందుకు వెళ్లరు? అని ప్రశ్నించారు. పార్టీలో అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదన్న ఆయన.. హుజూరాబాద్ లో మూడు ఎన్నికల్లో యాభై.. అరవై వేల ఓట్లు వచ్చాయని.. అందరం కలిసి పని చేస్తే మరో యాభైవేల ఓట్లు రావా? అని ప్రశ్నించారు.

పార్టీ అడ్రస్ సరిగా లేని దుబ్బాకలోనే 23 వేల ఓట్లు తెచ్చుకున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు. హుజూరాబాద్ లో ఫైట్ జరుగుతుంటే.. కాంగ్రెస్ దాన్ని వదిలేస్తే అర్థమేంటన్న ప్రశ్నను సంధించారు. హుజూరాబాద్ యుద్ధానికి ముందే చేతులు ఎత్తేశామా? అన్న ఆయన అందుకే తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానన్నారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తేనే గెలుస్తుందన్నారు. పార్టీ గెలుపు సంగతి తర్వాత ఇలా అసమ్మతి వ్యాఖ్యలతో.. పార్టీకి జరిగే నష్టం మాటేమిటన్న ప్రశ్నను పలువురు ప్రశ్నిస్తున్నారు. జగ్గారెడ్డిని సెట్ చేసిన అధినాయకత్వం.. కోమటిరెడ్డి విషయంలోనూ అంతే వేగంగా రియాక్టు అయితే తప్పించి పార్టీ ఫేట్ మారటం కష్టమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.