Begin typing your search above and press return to search.

కేసీఆర్‌కు.. కోమ‌టిరెడ్డి బంప‌ర్ ఆఫ‌ర్‌.. రిజైన్‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌ట‌న‌

By:  Tupaki Desk   |   26 July 2021 2:30 PM GMT
కేసీఆర్‌కు.. కోమ‌టిరెడ్డి బంప‌ర్ ఆఫ‌ర్‌.. రిజైన్‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌ట‌న‌
X
టీఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్లు చేశారు. కేసీఆర్‌ను ఓ రేంజ్‌లో తిట్టిపోశారు. కేసీఆర్‌కు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల క‌న్నా.. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు, పార్టీ ప్ర‌యోజ‌నాలే ఎక్కువ‌ని దుయ్య‌బ‌ట్టారు. కేవ‌లం ఎన్నిక‌లు వ‌స్తేనే.. ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గాలు క‌నిపిస్తా య‌ని.. అక్క‌డ అభివృద్ధి చేయాల‌నే ఆలోచ‌న వ‌స్తుంద‌ని విమ‌ర్శించారు. దేశంలో ఇలాంటి ముఖ్య‌మంత్రి ఏ రాష్ట్రంలోనూ లేడ‌ని.. దుయ్య‌బ‌ట్టారు. అంతేకాదు.. త‌న‌కు సంబంధించి కూడా కేసీఆర్‌కు బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించారు.. కోమ‌టిరెడ్డి.

విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి రాజుకుంది. ప్ర‌భుత్వం దృష్టి అంతా కూడా ఆ ఎన్నిక‌పైనే ఉంది. ఇక్క‌డ బీజేపీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను ఎట్టిప‌రిస్థితిలో ఓడించాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిప‌దిక‌న అనేక నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌రకు ప్ర‌క‌టించి కూడా నిధులు కేటాయించ‌ని ప‌థ‌కాల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ హుటాహుటిన అమ‌లు చేస్తున్నారు. నిత్యం స‌మీక్ష‌లు చేస్తున్నారు. హుజారాబాద్‌కు ఎక్కువ ల‌బ్ధి క‌లిగేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక్క‌డ ఈట‌ల హ‌వా ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో టీఆర్ ఎస్‌ను ఎట్టి ప‌రిస్థితిలో గెలిపించేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ క్ర‌మంలో స్పందించిన ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.. ముఖ్య‌మంత్రిపై విరుచుకుప‌డ్డారు. త‌న నియోజ‌క‌వ‌ర్గానికి కూడా రూ.2000 కోట్లు కేటాయిస్తానంటే.. తాను కూడా ఇప్ప‌టికిప్పుడు రిజైన్ చేసి.. ఈ సీటును ఉప ఎన్నిక‌లో టీఆర్ ఎస్ కే కేటాయిస్తాన‌ని.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఉప ఎన్నిక ఉన్న‌ హుజూరాబాద్‌కు రూ.2000 కోట్లు కేటాయిస్తున్న వైనాన్ని ఆయ‌న విమ‌ర్శించారు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు వ‌స్తేనే సీఎం కేసీఆర్‌కు అక్క‌డి అభివృద్ధి గుర్తుకు వ‌స్తుంద‌న్న కోమ‌టిరెడ్డి.. మునుగోడులో అభివృద్ధి కోసం..తాను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప‌ట్టించుకోలేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఈ నేప‌థ్యంలో మునుగోడు అభివృద్ది కావాలంటే.. ఉప ఎన్నిక రావాల్సిందేననే ధోర‌ణి క‌నిపిస్తోంద‌న్న ఆయ‌న‌.. కేసీఆర్ రూ.2000 కోట్లు ఇచ్చి.. నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉంటే.. తాను రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దేశ చ‌రిత్ర‌లో ఇలా వ్య‌వ‌హ‌రించిన సీఎం కేసీఆర్ ఒక్క‌రేన‌ని దుయ్య‌బ‌ట్టారు. కేవ‌లం ఎన్నిక‌ల రాజ‌కీయాలు చేసేందుకు మాత్ర‌మే ఆయ‌న అధికారం వినియోగిస్తున్నార‌ని, ఓట్లు, నోట్లు రాజ‌కీయాలు త‌ప్ప‌.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల‌నే ఆలోచ‌న కేసీఆర్‌కు లేద‌ని విమ‌ర్శించారు. ``కేసీఆర్‌కు కేవ‌లం టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే క‌నిపిస్తున్నారు. వారు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాలు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. విప‌క్ష నేత‌లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు ఆయ‌న‌కు క‌నిపించ‌డం లేదు`` అనినిప్పులు చెరిగారు.