అదృశ్యమైన కానిస్టేబుల్ ప్లాట్ ఫాంపై దైన్యస్థితిలో దర్శనం..ఏం జరిగింది!

Sun Nov 22 2020 16:40:44 GMT+0530 (IST)

Komaram Bheem District Constable Found

కానిస్టేబుల్ గా పని చేసే పాతికేళ్ళ యువకుడు  ఉన్నట్టుండి  అదృశ్యమయ్యాడు. అతడి జాడ కోసం ఎంత వెతికినా పోలీసులకు ఆచూకీ లభ్యం కాలేదు. చివరికి 25 రోజుల తర్వాత ఆచూకీ లభ్యం అవగా అతడిని చూసిన పోలీసులు షాక్ కు గురయ్యారు. చింపిరి  గడ్డం  చిరిగిన దుస్తులతో ప్లాట్ ఫాం పై అత్యంత దయనీయ స్థితిలో అతను కనిపించాడు. పోలీసులు అతడిని తమ అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సమస్యల కారణంగానే అతడు ఇల్లు వదిలి పెట్టి వచ్చి ఇలా మారాడని  తెలిసింది.కొమురంభీం జిల్లా పెంచికల్‌పేట పీఎస్ పరిధిలో కానిస్టేబుల్ గా  పనిచేస్తున్న భానేష్ అక్టోబర్ 28న ఉన్నట్లుండి అదృశ్యమయ్యాడు. చివరిసారిగా అతడు సిర్పూర్ టి చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహించగా.. అప్పట్నుంచి కనిపించకుండా పోయాడు. తిరిగి అతడు రాకపోవడంతో అతడి భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పలు చోట్ల వెతికినా అతని జాడ మాత్రం కనిపించలేదు. కొద్దిరోజుల తర్వాత భానేష్  స్వయంగా ఎస్ఐ కి ఫోన్ చేసి.. చేసిన అప్పులు అధికమయ్యాయని దీనికితోడు కుటుంబ సమస్యల వల్ల విధులకు హాజరు కాలేక పోతున్నానని తెలియజేశాడు.
అయితే అతడు ఎక్కడ ఉన్నది మాత్రంతెలియజేయకపోవడంతో పోలీసులు తమ దర్యాప్తును కొనసాగించారు.

 చివరికి అతడు కాజీపేట ప్లాట్ ఫాం పై కొద్దిరోజులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ అవసరాల కోసం పలు చోట్ల అప్పులు చేశానని.. దీంతో ఒత్తిళ్ళు అధికమవడంతో ఎటూ పాలుపోక ఇల్లు విడిచి వచ్చి ఇన్ని రోజులు ప్లాట్ ఫాంపై గడిపినట్లు భానేష్  తెలిపాడు. 25 రోజుల తర్వాత అత్యంత దయనీయ స్థితిలో  కానిస్టేబుల్ భానేష్  కనిపించడంతో అందరూ షాక్ కు  గురయ్యారు.