Begin typing your search above and press return to search.

రయ్ మంటూ నైట్ రైడర్స్ రైజింగ్ ..రాజస్థాన్ ఓటమి

By:  Tupaki Desk   |   1 Oct 2020 4:15 AM GMT
రయ్ మంటూ నైట్ రైడర్స్ రైజింగ్ ..రాజస్థాన్ ఓటమి
X
ఐపీఎల్ 2020లో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కి కోల్ కతా నైట్ రైడర్స్ బ్రేక్ లు వేసింది. మొదటి రెండు మ్యాచ్ లలో బ్యాటింగ్ బలంతో గెలిచిన రాజస్థాన్ ను ఈ సారి కోల్ కతా బౌలర్లు ముకుతాడు వేశారు.కేకేఆర్‌ 175 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ముందుంచినా.. బౌలర్లు శివమ్‌ మావి, నాగర్‌కోటి అంచనాలకు మించి రాణించడంతో బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ కి క్యూ కట్టారు.

కోల్‌కతా భారీ స్కోరు చేయకుండా ఆపగలిగామని సంబరపడ్డ రాజస్థాన్ బ్యాటింగ్‌లో నిలకడ చూపలేకపోయింది. 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ ఒడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా శుభ్‌మన్‌ గిల్‌ (34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 47), రాణా (22)మోర్గాన్‌ (34 నాటౌట్‌) మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 174/6 స్కోరు చేసింది.

బ్యాటింగ్ లో భీకరంగా కనిపిస్తున్న రాజస్థాన్ ఛేదనలో తడపడింది. కోల్ కతా యువ పేసర్లు శివమ్‌ మావి (2/20), నాగర్‌కోటి (2/13) దెబ్బకు రాజస్థాన్‌ ఓవర్లన్నీ ఆడి 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. టామ్‌ కర్రాన్‌ (36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 నాటౌట్‌) ఒక్కడే ఒంటరి పోరాటం చేసి అర్ధ శతకం సాధించాడు. శివమ్‌ మావికి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

42 పరుగులకే 5 వికెట్లు

ఛేదనలో రాజస్థాన్‌ బ్యాటింగ్‌ తడబడింది. రెండో ఓవర్‌లోనే కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (3) ఔట్ అయ్యాడు. కెప్టెన్ కార్తీక్ మరోసారి నిరాశ పరుస్తూ కమిన్స్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన రాహుల్‌ తెవాటియా (14) ఈ సారి ఫామ్ కొనసాగించ లేకపోయాడు ఇక జోరు మీదున్న సంజూ శాంసన్‌ (8) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. కోల్ కతా బౌలర్లు చెలరేగడంతో రాజస్థాన్‌ 42/5తో నిలిచింది.

సులువైన క్యాచ్ ఉతప్ప నేలపాలు

ఆరు బంతులు ఎదుర్కొన్న సునీల్ నరైన్.. కనీసం సింగిల్ కూడా తీయలేకపోయాడు. ఆ సమయంలో రాబిన్ ఉతప్పకు సులువైన క్యాచ్‌ ఇవ్వగా అతడు తత్తరపాటుకు గురై వదిలేసాడు. గాల్లోకి లేచిన బంతిని రివర్స్ కప్‌ స్టయిల్‌లో క్యాచ్‌గా అందుకునేందుకు ప్రయత్నించిన రాబిన్ ఉతప్ప.. ఒడిసి పట్టుకోవడంలో ఫెయిలయ్యాడు. దాంతో బౌలర్ జయదేవ్ ఉనద్కత్‌తో పాటు కెప్టెన్ స్టీవ్‌స్మిత్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.దాంతో ఉతప్పని నెటిజన్లు ఉతికారేస్తున్నారు.


ఉనద్కత్ బ్యాటింగ్ టైంలో
అరుదైన ఘటన

కుల్దీప్ యాదవ్ వేసిన 17.6వ ఓవర్లో జయదేవ్ ఉనద్కత్ డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్స్ కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ గాల్లోకి లేచిన బంతి బౌండరీ వెలుపల పడుతుందనకుంటే.. అనూహ్యంగా కమలేష్ నాగర్ కోటికి క్యాచ్‌గా వెళ్లింది.
బంతి స్పైడర్ కెమెరా కేబుల్‌కు తాకిందని ఉనద్కత్ అంపైర్లకు చెప్పాడు. దీంతో బంతిని రిప్లయ్ ద్వారా పరిశీలించిన అంపైర్లు ఎటూ తేల్చలేకపోయారు. ఎంతకూ క్లారిటీ రాకపోవంతో.. చివరకు వేలు పైకెత్తి ఉనద్కత్ ఔటైనట్లు ప్రకటించారు. దీంతో ఉనద్కత్ 9 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.వాస్తవానికి బంతి స్పైడర్ కెమెరాకు గానీ లేదా దాని కేబుల్‌కు గానీ తాకితే దాన్ని డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు. అంపైర్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి.

మ్యాచ్ లో హైలైట్స్ ఇవే

* ఈ మ్యాచ్ తో కోల్ కతా లీగ్‌లో వరుసగా రెండో విజయం సాధించింది

* రాజస్థాన్ జట్టులో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.

* కోల్ కతా కెప్టెన్ దినేష్ కార్తీక్ వరుసగా మూడో మ్యాచ్ లో కూడా విఫలం అయ్యాడు.

* రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాబిన్ ఊతప్ప ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించాడు. మ్యాచ్ లో బంతిపై లాలాజలం రాశాడు. కోల్ కతా బ్యాటింగ్ చేస్తుండగా మూడో ఓవర్ ఐదవ బంతి సమయంలో సునీల్ నరైన్ ఇచ్చిన క్యాచ్ మిస్ చేసినప్పుడు ఉతప్ప ఇలా చేశాడు. కరోనా నేపథ్యంలో సలైవాపై ఐసీసీ నిషేధం విధించింది. ఉతప్పపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.