నాలుగే గంటలు.. ప్రేమంటే.. ఇదేరా.?

Thu Oct 10 2019 17:46:44 GMT+0530 (IST)

Kolkata Couple Ties Knot In Four Hours Of Meeting For The First Time

లవ్ ఎట్ ఫస్ట్ సైట్..’ సినిమాల్లో భారీగా దీని గురించి చూపిస్తారు. కానీ నిజజీవితంలోనూ ఇలాంటి సంఘటన ఒకటి కోల్ కతాలో చోటుచేసుకుంది. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే వీరు చూసుకోవడం.. ప్రేమలో పడడం.. పెళ్లి కూడా అదే రాత్రి చేసుకోవడం విశేషం.కోల్ కతాలోని హింద్ మోటార్ ప్రాంతానికి చెందిన వరుడు సుదీప్ ఘోషల్ కు సోషల్ మీడియాలో  షియోరాఫూలికి చెందిన వధువు ప్రతమా బెనర్జీ పరిచయం అయ్యింది. మూడునెలలుగా వీరు సోషల్ మీడియాలోనే చాట్ చేసుకుంటున్నారు.

దసరా సందర్భంగా సుదీప్ - ప్రతమా బెనర్జీ మెసేజ్ లు పెట్టుకొని  కోల్ కతాలోని సంతోష్ మిత్ర స్వ్కేర్ వద్ద కలుసుకుందామని అనుకున్నారు.. సాయంత్రం 8 గంటలకు అక్కడి అమ్మవారి మండపానికి ఇద్దరు వచ్చారు. తొలిచూపులోనే ఇద్దరికి ఒకరంటే ఒకరు నచ్చారు.

సుదీప్ రాత్రి 8 గంటలకు తొలిచూపులోనే ప్రతమా బెనర్జీని చూసి ఇష్టపడి ప్రపోజ్ చేశాడు. సుదీప్ ప్రేమకు ఫిదా అయిపోయి ప్రతమా వెంటనే ఓకే చెప్పింది. స్నేహితులంతా వీరి ప్రేమను ప్రోత్సహించడంతో అదే రోజు రాత్రి 10.30 గంటలకు స్థానిక మండపం వద్దే పెళ్లి చేసుకున్నారు.  వీరిద్దరి పెళ్లికి వధూవరుల కుటుంబాల వారు అంగీకరించడం విశేషం. ఇలా నాలుగు గంటల్లోనే వీరి చూపులు.. ప్రేమ.. పెళ్లి కూడా జరిగిపోవడం గమనార్హం.