Begin typing your search above and press return to search.

కోడెల మృతిపై క‌ల‌క‌లం..పోస్ట్‌ మార్టం రిపోర్టులో మెలిక‌

By:  Tupaki Desk   |   15 Dec 2019 4:24 PM GMT
కోడెల మృతిపై క‌ల‌క‌లం..పోస్ట్‌ మార్టం రిపోర్టులో మెలిక‌
X
ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్ - టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు మృతికి సంబంధించి మ‌రో ట్విస్టు తెర‌మీద‌కు వ‌చ్చింది. గత సెప్టెంబర్‌ 16వ తేదీన కోడెల హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ లోని తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక ఇంకా అందలేదని బంజారాహిల్స్‌ ఏసీపీ - ఈ కేసు విచారణ అధికారి కేఎస్‌ రావు వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

బంజారాహిల్స్ రోడ్ నెంబ‌ర్ 7లోని త‌న‌ అద్దె ఇంట్లో సెప్టెంబర్‌ 16వ తేదీ ఉదయం నిద్ర లేచిన అనంతరం దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. ఉదయం 10 గంటల సమయంలో భార్య శశికళ - కుమార్తె విజయలక్ష్మితో కలసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం అలసటగా ఉందంటూ మొదటి అంతస్తులో ఉన్న పడక గదిలోకి వెళ్లి లోపల నుంచి తలుపు గడియ పెట్టుకున్న కొద్దిసేప‌టి త‌ర్వాత ఆయ‌న అప‌స్మారక స్థితిలో ఉండ‌గా - సుమారు గంట పాటు ఆయనకు వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని - 12.39 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారని వెల్ల‌డించారు.

కోడెల మ‌ర‌ణం రాజ‌కీయంగా తీవ్ర వివాదాస్ప‌దం అయిన నేప‌థ్యంలో ఆయ‌న‌ భార్య - కుమార్తె - డ్రైవర్ - గన్‌ మెన్‌ నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తన తండ్రి ధోవతిని చింపి తాడుగా చేసుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు కోడెల కుమార్తె విజయలక్ష్మి పోలీసులకు తెలిపారు. దాదాపు నాలుగైదు ముడులతో ఉన్న తాడు అక్కడ లభించిందని - అయితే కేబుల్‌ వైరుతో ఉరి వేసుకున్నట్లు గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. ఘటన అనంతరం కోడెల నివాసానికి చేరుకున్న క్లూస్‌ టీమ్‌ పలు ఆధారాలు సేకరించింది.

కోడెల ఆక‌స్మిక మృతి నేప‌థ్యంలో కుటుంబ సభ్యులను పోలీసులు ఇప్పటికే విచారించి ఆయన సెల్‌ ఫోన్‌ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కోడెల‌ మృతి చెందిన రోజు ఘటనా స్థలంలో సేకరించిన కొన్ని వస్తువులను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించామ‌ని పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఇంకా రిపోర్టు అంద‌లేద‌ని వెల్ల‌డించారు. మూడు నెల‌లుగా రిపోర్టు పెండింగ్‌ లో ఉండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.