కోడెల కొడుకు కోసం ఎదురు చూపులు... హైదరాబాద్‌కు బాబు

Mon Sep 16 2019 19:38:02 GMT+0530 (IST)

Kodela Siva Prasad Body Shifted to NTR Trust Bhavan

టీడీపీ సీనియర్ నాయకుడు ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సోమవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ వేధింపులు తాళలేకనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కోడెల మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తయిన వెంటనే ఆయన పార్థీవదేహాన్ని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ శ్రేణుల సందర్శనార్థం ఉంచారు. ట్రస్ట్ భవన్ కు కార్యకర్తలు నేతలు భారీగా తరలి వస్తున్నారు. ఇక కోడెలది ఆత్మహత్యే అని... ఆయన ఉరి వేసుకున్నారని నివేదిక చెప్పింది. దీంతో ఉదయం నుంచి కోడెల మృతిపై ముసురుకున్న అనుమానాలకు ఫుల్‌స్టాప్ పడినట్లయ్యింది.టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గుంటూరు నుంచి హైదరాబాద్ కు వచ్చి...మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి గుంటూరుకు రోడ్డు మార్గం ద్వారా కోడెల పార్థివ దేహాన్ని తీసుకెళ్లనున్నారు. చంద్రబాబుతో పాటు లోకేశ్ కూడా గుంటూరుకు బయల్దేరి వెళ్లనున్నారు. ఇక కోడెల తనయుడు శివరామకృష్ణ కూడా ఉదయం కోడెల పార్థివదేహం వెంట గుంటూరుకు రానున్నారు. ప్రస్తుతం అందరూ కోడెల తనయుడి రాక కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం కెన్యాలో ఉన్న కోడెల తనయుడు మంగళవారం ఉదయం 5 గంటలకు ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడ నుంచి హైదరాబాద్‌కు వస్తాడు.

ఇదిలా ఉంటే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య నేపథ్యంలో ఆయన భార్య శశికళ అస్వస్థతకు గురయ్యారు. కోడెల మృతితో ఆమె షాక్‌లోకి వెళ్లారని.. ఈ క్రమంలోనే శశికళ ఆరోగ్యం క్షీణించిననట్లు తెలుస్తోంది. ఇక సమాచారం తెల్సుకున్న వైద్యులు కోడెల ఇంటికి వెళ్లి శశికళకు వైద్య చికిత్స అందిస్తున్నారు. కోడెల మృతితో ఇప్పటికే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన కూతురు విజయలక్ష్మి గుండెలవిసేలా రోదిస్తోంది. ఈ తరుణంలో కోడెల శశికళ ఆరోగ్యం కూడా క్షీణించడంతో కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళన నెలకొంది.