కోదండరాం కొత్తకలలు.. నేనే సీఎం!

Wed May 23 2018 13:31:23 GMT+0530 (IST)

Kodandaram predictions on Next Elections

తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సీఎం కలలు పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరూ నేనే సీఎం అంటున్నారు. ఏతా వతా రెండురాష్ట్రాల్లో సుమారు 10 మంది సీఎం అభ్యర్థులు కనిపిస్తున్నారు. ఇంతకీ తాజాగా సీఎం కుర్చీపై కన్నేసిందెవరో తెలుసా... మన ప్రొఫెసర్ గారు. అదేనండీ కోదండరాం మాస్టారు.ఈరోజు కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణ స్వీకారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడి పరిణామాలపై కోదండరాం స్పందించారు. అనేక ట్విస్టుల మధ్య ఎంతో ఉత్కంఠను జోడిస్తూ సాగిన కన్నడ సీఎం పీఠం కైవసం చేసుకునే రాజకీయ ఎత్తుగడలో ఎట్టకేలకు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి నెగ్గడం ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ తనకంటే ఎక్కువ సీట్లు వచ్చిన కాంగ్రెస్ మద్దతుతో సీఎం కుర్చీని చేజిక్కించుకోవడం తెలిసిన సంగతే. ఈ పరిణామం దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతీయ పార్టీలకు ఊపునిచ్చింది. సీట్లు తక్కువే అయినా ప్రధానపార్టీలు తమ మద్దతు లేకుండా ముందుకు పోలేని పరిస్థితి ఏర్పడుతోందని చిన్న పార్టీలు అంచనాలు వేస్తున్నాయి. అయితే ఈ మధ్యనే పార్టీ పెట్టిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అంతకుమించి ఆశిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీదే అధికారం అని బల్లగుద్ది చెప్పేశారాయన.

కన్నడ రాజకీయాలపై స్పందించిన కోదండరాం... ప్రజల ఆకాంక్షలు జాతీయ పార్టీలు తీర్చడంలేదని వ్యాఖ్యానించారు. అందుకే కర్ణాటకలో అలాంటి ఫలితాలు వచ్చాయన్నారు. తెలంగాణలో హంగ్ రాదని ప్రజలు తమకు సంపూర్ణ మెజార్టీ ఇస్తారని విశ్లేషించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జనసమితి కింగ్ మేకర్ కాదు కింగే అవుతుందని కోదండరాం జోస్యం చెప్పారు. ఇప్పటి వరకు వక్రంగా సాగుతున్న రాజకీయ పద్ధతులను తాము సమూలంగా మారుస్తామని కోదండరాం తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసమితి ఒంటరిగానే పోటీ చేస్తుందని పొత్తులు పెట్టుకోబోమని కోదండరాం వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు జనసమితి పార్టీకి దరఖాస్తు చేసుకోవాలని కోరగా విశేష స్పందన వస్తోందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 1000 మంది అప్లై చేసుకున్నారని వివరించారు. అప్లై చేసుకున్న వారు పూర్తిగా యువతనే అని చెప్పారు. 27 న వారికి స్థానిక సంస్థల అంశాలపై శిక్షణ కూడా ఇస్తామన్నారు. రైతులో యువకుల్లో తమ పార్టీ పై ఆదరణ ఉందని ఆయన తెలిపారు. 119 స్థానాల్లో పోటీ చేస్తామని యువతకు ప్రాధాన్యం ఇస్తామని కోదండరాం ప్రకటించారు.

కాగా కర్ణాటక అనుభవాల నేపథ్యంలో టీజేఎస్ రథసారథి కోదండరాం ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో పార్టీ నిర్మాణం లేని తెలంగాణ జనసమితి ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసుకోవడమే కాకుండా....ఇతర పార్టీలు తమ శరణు చొచ్చేలా చేయగలారా ? అనే అనుమానం సహజంగానే తెరమీదకు వస్తోంది. దీనికి మాస్టారు ఏం సమాధానం ఇస్తారో చూడాలి మరి.