Begin typing your search above and press return to search.

కిమ్ జోంగ్ వింత నిర్ణయంపై 'కిమ్' అనని కొరియన్లు..!

By:  Tupaki Desk   |   5 Dec 2022 2:30 PM GMT
కిమ్ జోంగ్ వింత నిర్ణయంపై కిమ్ అనని కొరియన్లు..!
X
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ వింత నిర్ణయాలకు కేరాఫ్ గా మారుతున్నారు. అనునిత్యం దక్షిణ కొరియాపై కాలుదువ్వుతూ వార్తలో నిలిచే కిమ్ జోంగ్ తన దేశంలో మాత్రం నియంత పాలనను కొనసాగిస్తున్నాడు. నార్త్ కొరియాలో ఆయన మాటే శాసనం.. ఎవరైనా ధిక్కరిస్తే మరణశిక్షకు కూడా ఏమాత్రం వెనుకాడరనే ప్రచారం ఉంది.

ఈ నేపథ్యంలో కిమ్ జోంగ్ నిర్ణయాలకు కొరియన్లు కక్కలేక మింగలేక పాటిస్తున్నారు. ఇదే అదనుగా కిమ్ జోంగ్ నిత్యం ఏదో ఒక వింత నిర్ణయాలను తీసుకుంటూ ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. తాజాగా ఆ దేశంలోని చిన్నారులకు ఏయే పేర్లు పెట్టాలో కూడా కిమ్ జోంగ్ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

కిమ్ జోంగ్ కు తొలి నుంచి బాంబులు.. తుపాకులు.. ఉప గ్రహాలంటే ఎంతో ఇష్టం. ఈ నేపథ్యంలో కొత్త కొత్త ఆయుధాలు.. ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. తరుచూ అణ్వస్త్రాలు.. క్షిపణి ప్రయోగాలను చేపడుతూ అటూ అమెరికా.. ఇటూ ఉత్తర కొరియాకు పక్కలో బల్లెంలా మారిపోయాడు. ఈ క్రమంలో ఆయా దేశాల మధ్య తరుచూ ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుంది.

మరోవైపు కిమ్ జోంగ్ తనకు బాంబులు.. తుపాకులపై ఉన్న మక్కువను నార్త్ కోరియన్లపై మరోలా రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. తమ దేశంలోని చిన్నారులకు తుపాకీ.. బాంబు.. శాటిలైట్ వంటి పేర్లు పెట్టాలని ఉత్తర్వులు జారీ చేశాడు. ఈ పేర్లన్నీ దేశభక్తికి చిహ్నాలనీ.. వీటినే చిన్నారుల తల్లిదండ్రులు పిల్లలకు పెట్టాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పటికే చిన్నారులకు పిల్లలు పెడితే వాటిని మార్చివేసి ఈ పేర్లను పెట్టాలని సూచించాడు. కిమ్ ఆదేశాలనే నేపథ్యంలో నార్త్ కొరియా అధికారులు పిల్లల పేర్లు మార్చేలా తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. పేర్ల చివర హల్లులు లేకపోతే అది సోషలిస్టుకు వ్యతిరేకమని చెబుతున్నారు. పేర్లు మార్చకుంటే తొలుత జరిమానాలు విధిస్తామని అప్పటికీ మార్చకుంటే శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు.

కిమ్ జోంగ్ ఇలాంటి వింత నిర్ణయాలు తీసుకోవడం ఆ దేశంలో కొత్తేమీ కాదు. గతంలో నార్త్ కొరియన్లు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? ఎలాంటి హెయిర్ స్టైల్ చేయించుకోవాలి?.. ఎలాంటి సినిమాలు చూడాలో కూడా కిమ్ జోంగ్ నిర్ణయించేవారు. ప్రజలకు ఇష్టం లేకుండా ఆయన నిర్ణయం పాటించాల్సిందే. ఎవరైనా ఎదిరిస్తే అతడికి భూమి మీద నూకలు చెల్లినట్లే. దీంతో నార్త్ కొరియన్లు  కిమ్ జోంగ్ నిర్ణయాలను ‘కిమ్’ అనకుండా పాటిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.