Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ కోసం దూడ‌ల‌ను చంపేస్తున్నారా?

By:  Tupaki Desk   |   16 Jun 2021 4:30 PM GMT
వ్యాక్సిన్ కోసం దూడ‌ల‌ను చంపేస్తున్నారా?
X
క‌రోనా మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు మందు లేదు. ముంద‌స్తుగా అడ్డుకునేందుకు వేసే వ్యాక్సిన్ మాత్రమే ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఔష‌ధం. దానిపైనా ఎన్నో అనుమానాలు, ఆరోప‌ణ‌లు వ‌స్తూనే ఉన్నాయి. వ్యాక్సిన్ తొలినాళ్ల‌లో పంది కొవ్వుతో వ్యాక్సిన్లు త‌యారు చేశార‌ని, వాటిని ముస్లిం దేశాలు వ్య‌తిరేకిస్తున్నాయ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింది. ఇప్పుడు కొత్తగా మ‌రో ప్ర‌చారం బ‌య‌ల్దేరింది.

భార‌త్ భ‌యోటెక్ త‌యారు చేస్తున్న దేశీయ వ్యాక్సిన్ కొవాగ్జిన్ కోసం లేగ‌దూడ‌లను చంపేస్తున్నార‌ని, వాటి క‌ణాల ద్వారా వ్యాక్సిన్ త‌యారు చేస్తున్నారంటూ సోష‌ల్ మీడియాలో విస్తృత ప్ర‌చారం సాగుతోంది. దీనికి మ‌ద్ద‌తుగా కాంగ్రెస్ నేత గౌర‌వ్ కూడా ఆరోప‌ణ‌లు చేయ‌డంతో వివాదం పెద్ద‌దైంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వంతోపాటు భార‌త్ భ‌యోటెక్ కూడా క్లారిటీ ఇచ్చాయి.

వ్యాక్సిన్ త‌యారీ కోసం లేగ‌దూడ‌ల‌ను చంపేస్తున్నార‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఏ మాత్రం వాస్త‌వం లేద‌ని తేల్చి చెప్పాయి. వ్యాక్సిన్ లో కీల‌క‌మైన వీరో క‌ణాల అభివృద్ధికి లేగ‌దూడ ద్ర‌వాల‌ను మాత్రమే వినియోగిస్తున్న‌ట్టు కేంద్రం తెలిపింది. వీరోక‌ణాల అభివృద్ధికి త‌ప్ప‌కుండా ప‌లు ర‌కాల ఆవులు, ఇత‌ర జంతువుల‌ ద్ర‌వాలు అవ‌స‌ర‌మేన‌ని, ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ త‌యారీ ప‌ద్ధ‌తే ఇది అని స్ప‌ష్టం చేసింది.

కొవిడ్ వ్యాక్సిన్ మాత్ర‌మే కాదు.. పోలియో, రేబిస్‌, ఇన్ ప్లూయంజా వ్యాక్సిన్లు కూడా ఇదే విధంగా త‌యారు చేస్తార‌ని తెలిపింది. వీరో క‌ణాల ద్వారా.. వైర‌స్ ను దెబ్బ‌తీసి, పూర్తిగా చ‌నిపోయిన క‌ణాల‌తోనే వ్యాక్సిన్ త‌యార‌వుతుంద‌ని తెలిపింది. ఇది తెలియ‌ని వాళ్లు చేసే అసత్య ప్ర‌చారాల‌ను న‌మ్మొద్ద‌ని కేంద్రం సూచించింది.