కిల్లికి సెగపెడుతున్న కృష్ణదాస్.. సిక్కోలు వైసీపీలో సెగలు..!

Wed Jun 29 2022 08:29:42 GMT+0530 (IST)

Killi Kruparani VS Krishnadas

వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ముఖ్యంగా అంతో ఇంతో బలంగా ఉన్నామని చెబుతున్న శ్రీకాకుళం జిల్లాలోనే ఇప్పుడు ఆధిపత్య రాజకీయాలు తెరమీదికి వచ్చాయి. వాస్తవానికి ఇక్కడ టీడీపీ పుంజుకుంటోంది. టీడీపీకి బలమైన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు.పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నుంచి ఎంపీ రామ్మోహన్ వరకు కూడా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కళా వెంకటరావు అటు గౌతు శిరీష కూన రవికుమార్ లాంటి బలమైన నేతలు ఇప్పుడు ఈ జిల్లాలోనే ఉన్నారు.

ఇలాంటి సమయంలో ఈ జిల్లాలో వైసీపీ మరింత పుంజుకోవాలని.. పార్టీ ఎన్నిప్రయత్నాలు చేస్తున్నా గ్రూపు రాజకీయాలు ఆ పార్టీని నాశనం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కింజరాపు కుటుంబాన్ని ఓడించాలనేది వైసీపీ వ్యూహం.

ఈ క్రమంలోనే ధర్మాన కుటుంబానికి మంత్రి పదవులు ఇచ్చింది. అదే సమయంలో మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజుకు కూడా మంత్రి పదవి ఇచ్చింది. అయినప్పటికీ.. ఇక్కడ పార్టీ పుంజుకునే పరిస్థితి లేక పోగా.. ఆధిపత్య రాజకీయాలు నానాటికీ పెరుగుతున్నతీరు అందరినీ కలవరపరుస్తోంది.

ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి వచ్చి.. వైసీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి జిల్లా పార్టీ ఇంచార్జ్ గా ఉన్న కిల్లి కృపారాణి వ్యవహారంఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆమెకు మొన్న ఎమ్మెల్సీ వస్తుందనుకున్నా రాలేదు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు ఇచ్చారు. తర్వాత రాజ్యసభ ఇస్తారన్నా ఇవ్వలేదు. ఆమెకు ధర్మాన కృష్ణదాస్ అడ్డుతగులుతున్నారని ఆమె రాజకీయాలను ఆయన అడ్డుకుంటున్నారని కిల్లి వర్గం ఆరోపిస్తోంది.

తాజాగా సీఎం పర్యటనకు వెళ్లిన కిల్లిని..పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె కన్నీరు పెట్టుకుని వెనుదిరిగిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇది వార్తల్లో ప్రముఖంగా రావడంతో అధిష్టానం.. జిల్లాలో ఏం జరుగుతోందనే విషయంపై ఆరా తీసినట్టు సమాచారం. అంతేకాదు.. జిల్లా రాజకీయాలపై ఇంచార్జ్ మంత్రిని నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిసింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.