Begin typing your search above and press return to search.

డెల్టా తో పిల్లలకు పెద్దగా ముప్పేమీ లేదు

By:  Tupaki Desk   |   25 Sep 2021 2:30 AM GMT
డెల్టా తో పిల్లలకు పెద్దగా ముప్పేమీ లేదు
X
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కంటిమీద కునుకులేకుండా చేస్తున్న డెల్టా రకం కరోనా వైరస్‌ వల్ల చిన్నారులకు ప్రమాదకరమా? అమెరికా నిపుణులు మాత్రం దీనిపై బలమైన ఆధారాలేమీ లేవంటున్నారు. కరోనాలోని మునుపటి వేరియంట్లతో పోలిస్తే డెల్టా వల్ల చిన్నారులు, కౌమారప్రాయులు తీవ్రస్థాయిలో అనారోగ్యం పాలవుతారని వెల్లడి కాలేదని చెప్పారు. అయితే అధిక సాంక్రమిక శక్తిని కలిగి ఉండటం వల్ల ఈ రకం వైరస్‌తో పిల్లల్లో ఇన్‌ఫెక్షన్లు పెరిగాయని తెలిపారు. అందువల్ల పాఠశాలల్లో వీరు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.

5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకు తమ కరోనా వ్యాక్సిన్ సురక్షితమని అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్ వెల్లడించింది. యూఎస్లో ఈ ఏజ్గ్రూప్ పిల్లలకు అత్యవసర వాడకానికి అనుమతి కోసం త్వరలోనే అప్లై చేసుకుంటామంది. 2,268 మంది ఎలిమెంటరీ స్కూల్ పిల్లలపై ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ చేశామని, మామూలు డోసులో మూడో వంతు ఇచ్చామని సంస్థ వెల్లడించింది. రెండో డోసు తర్వాత పిల్లల్లో కరోనా యాంటిబాడీలు పెద్దవాళ్లలానే డెవలప్ అయ్యాయంది. జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని చెప్పింది.

ఫైజర్, బయో ఎన్ టెక్ కలిసి డెవలప్ చేసిన ఈ వ్యాక్సిన్ఇప్పటికే12 ఏళ్లు పైబడిన వాళ్లకు అందుబాటులో ఉంది. మోడెర్నా కూడా పిల్లలపై ట్రయల్స్ చేస్తోంది. 6 నెలలు, ఆ తర్వాత పిల్లలపై కూడా ఫైజర్, మోడెర్నా ట్రయల్స్ ప్రారంభించాయి. ఈ ఏడాదిలోనే వీటి రిజల్ట్స్ రానున్నాయి. క్యూబా కూడా తమ దేశంలోనే తయారుచేసిన టీకాను 2 ఏళ్ల పిల్లలకు వేయడం స్టార్ట్ చేసింది. చైనాలో మూడేళ్ల పైబడిన వాళ్లకు వ్యాక్సిన్ వేస్తున్నారు

కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి అమెరికాలో 50 లక్షల మందికిపైగా చిన్నారులు ఈ మహమ్మారి బారినపడ్డారు. ఆగస్టు చివర్లో, సెప్టెంబరు మొదట్లో ఈ వ్యాధితో ఆసుపత్రిపాలైన చిన్నారుల సంఖ్య, గత ఏడాది శీతాకాలంలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్నప్పటి స్థాయిలోనే ఉందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) తెలిపింది. వీరిలోనూ ఎక్కువ మందికి స్వల్పస్థాయి లక్షణాలే ఉన్నాయని పేర్కొంది. వాస్తవానికి వారిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని తెలిపింది. దీన్నిబట్టి డెల్టాతో పిల్లలకు కొత్తగా పెరిగిన ముప్పేమీ లేదని శాస్త్రవేత్తలు వివరించారు.