Begin typing your search above and press return to search.

ఆరు నెలల్లో కరోనా కంట్రోల్లోకి ... మూడో వేవ్ పై కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   16 Sep 2021 11:30 AM GMT
ఆరు నెలల్లో కరోనా కంట్రోల్లోకి ... మూడో వేవ్ పై కీలక వ్యాఖ్యలు
X
గత కొన్ని రోజుల క్రితం డ‌బ్ల్యూహెచ్వో సైంటిస్ట్ సౌమ్య స్వామినాథ‌న్ మాట్లాడుతూ ... ఇండియాలో కోవిడ్ ఎండెమిక్ స్టేజ్ లోకి ప్ర‌వేశించింద‌న్నారు. మలేరియా త‌దిత‌ర విష‌జ్వ‌రాల వ‌లె కరోనా కూడా ఈ భౌగోళిక ప్రాంతంలో వ్యాపిస్తుంద‌న్నారు. తీవ్ర ప్ర‌భావం త‌గ్గుతుంద‌ని, మ‌రిన్ని వేవ్ లు వ‌స్తాయ‌ని చెప్ప‌లేమ‌ని, ఒక‌వేళ కేసుల సంఖ్య పెరిగినా,సెకెండ్ వేవ్ త‌ర‌హాలో తీవ్ర ప్ర‌భావం ఉండ‌ద‌ని ఆమె త‌మ అంచ‌నాల‌ను తెలిపారు. ఇప్పుడు నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ చీఫ్ డాక్ట‌ర్ సింగ్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని చెబుతున్నారు. రానున్న రోజుల్లో భార‌త‌దేశంలో క‌రోనాను హ్యాండిల్ చేయ‌డం సుల‌భ‌త‌రం అవుతుంద‌ని ఆయ‌న త‌మ అంచ‌నాల గురించి తెలిపారు.

ఇంకో ఆరు నెల‌ల్లోనే క‌రోనా ఒక ఫ్లూ త‌ర‌హాలో మారుతుంద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. సాధార‌ణ ఫ్లూ జ్వ‌రాల‌కు ఆసుప‌త్రుల్లో వైద్యం అందిన‌ట్టుగానే క‌రోనా కు కూడా వైద్యం అందుతుంద‌న్నారు. సెకెండ్ వేవ్ స‌మ‌యంలో త‌లెత్తిన తీవ్ర‌మైన ప‌రిస్థితుల్లాంటివి ఉండ‌క‌పోవ‌చ్చ‌ని తెలిపారు. ఇప్పుడు కూడా ఇండియాలో వైర‌ల్ ఫీవ‌ర్లు విజృంభిస్తున్నాయి. వాటితో అనేక మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతున్నారు. అయితే డాక్ట‌ర్ల వ‌ద్ద‌కు వెళ్ల‌డం, వారిచ్చే ట్యాబ్లెట్ల‌ను వాడుతూ రెండు మూడు రోజుల్లో రిక‌వ‌ర్ అవుతున్నారు చాలా మంది. త్వ‌ర‌లో క‌రోనా ప్ర‌భావం కూడా ఈ స్థితికి వ‌స్తుందన్న‌ట్టుగా ఈ హెల్డ్ బాడీ చీఫ్ చెబుతున్నారు.

కాగా, భారతదేశంలో ఓ మోస్తరు స్థాయిలో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి కరోనా వైరస్ మారుతున్నట్లు కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే. భారత్ లో జనాభా, రోగనిరోధక శక్తిలో వైవిధ్యాలను బట్టి చూస్తే, కొద్దిపాటి హెచ్చుతగ్గులతో ప్రస్తుత తరహాలోనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా వైరస్ కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక 2022 ఆఖరు నాటికి 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తయి, కరోనా ముందునాటి పరిస్థితులు తిరిగివస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

దేశంలో అత్యధిక కరోనా కేసులు వెలుగుచూస్తున్న కేరళ కూడా ఇప్పుడిప్పుడే ఆ సంక్షోభం నుంచి బయటపడుతోందని వెల్లడించారు. కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో వ్యాక్సినేషన్ అంత్యంత కీలకమని ఎన్సీడీసీ డైరెక్టర్ సుజీత్ సింగ్ స్పష్టం చేశారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 75 కోట్ల డోసులు పంపిణీ చేశారని తెలిపారు. ఒకవేళ వ్యాక్థిన్ సమర్థత 70 శాతంగా ఉన్నట్లయితే ఇప్పటికే దేశంలో దాదాపు 50 కోట్ల మందికి ఇమ్యూనిటీ వచ్చినట్లేనని ఆయన తెలిపారు. అయితే, కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేగాక, వ్యాక్సినేషన్ వల్ల కలిగే రోగ నిరోధకత శక్తి 70 నుంచి 100 రోజుల తర్వాత క్రమంగా క్షీణిస్తుందని నిపుణులు చెబెతున్నారని సుజీత్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొత్త వేరియంట్లు వెలుగుచూడలేదని వెల్లడించారు. ఎం.సీ.1.2 వేరియంట్ల ప్రభావం ఇప్పటి వరకు భారతదేశంలో లేదని ఆయన స్పష్టం చేశారు. కొత్త వేరియంట్ కారణంగానే థర్డ్ వేవ్ వస్తుందని అంచనా వేయలేమన్నారు.