ప్రజా వేదికను కూల్చండి..కానీ..అంటున్న టీడీపీ ఎంపీ!

Tue Jun 25 2019 12:01:45 GMT+0530 (IST)

ప్రజా వేదిక విషయంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒకింత భిన్నస్పందనలు వ్యక్తం అవుతున్నాయి. అది అక్రమ కట్టడం అని ప్రభుత్వమే తేల్చి చెబుతూ ఉంది. చంద్రబాబు హయాంలో అక్రమ నిర్మాణంగా దాన్ని నిర్మించారని ఏపీ ప్రభుత్వం చెబుతూ ఉంది. దాన్ని కూల్చి వేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.ఈ నేపథ్యంలో ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అసహనం వ్యక్తం చేస్తూ ఉంది. దాన్ని కూల్చడం ఎందుకని టీడీపీ ప్రశ్నిస్తోంది. అది అక్రమ కట్టడం అనే అంశాన్ని టీడీపీ అసలు ప్రస్తావించడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం మీద టీడీపీ ఎదురుదాడి చేస్తూ ఉంది.

అయితే ఈ విషయంలో టీడీపీ ఎంపీ కేశినేని  నాని ఒకింత భిన్నంగా స్పందించాడు. ప్రజా వేదికను కూల్చడాన్ని ఈయన గట్టిగా వ్యతిరేకించడం లేదు. దాన్ని కూల్చండి అన్నట్టుగానే ఆయన స్పందిస్తూ ఉండటం గమనార్హం. ఈ మధ్య ప్రతి అంశం పైనా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు కేశినేని నాని. ఈ క్రమంలో ప్రజా వేదిక విషయంలో కూడా అక్కడే రియాక్ట్ అయ్యాడు.

ప్రజా వేదికను కూల్చేయాలన్న నిర్ణయాన్ని  మిగతా టీడీపీ నేతల్లా ఈయన గట్టిగా వ్యతిరేకించలేదు. అది అక్రమ కట్టడమే అన్నట్టుగా మాట్లాడారు. అయితే ముందుగా మిగతా అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని కేశినేని నాని సూచిస్తున్నాడు. అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చి వేసి - ఆఖర్లో ప్రజా వేదికను కూల్చాలని సూచిస్తున్నారు ఈ ఎంపీ. అంత వరకూ ఆ భవనాన్ని  ప్రభుత్వ సమావేశాలకు ఉపయోగించుకోవాలని చెబుతున్నాడు. కొత్త భవనం కట్టుకోవాలంటే  ఎక్స్ ట్రా ఖర్చు కదా అంటున్నాడు. అయినా ఇది అక్రమ కట్టడం అని టీడీపీ నేతలే ఒప్పుకుంటున్నారు. చంద్రబాబు పాలనకు పడే మరకే ఇది!