కేశినేని నాని తిట్టింది లోకేష్ నేగా....

Sun Jul 14 2019 11:27:25 GMT+0530 (IST)

Kesineni Nani Tweets on Buddha Venkanna and Nara Lokesh

టీడీపీలో గత నెల రోజులుగా ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని మరో సంచలన ట్వీట్ తో టీడీపీలో కలకలం రేపారు. ఎన్నికల్లో టిడిపి గెలిచిన మూడు ఎంపీ సీట్లలో విజయవాడ ఒకటి. అసలు ఎన్నికలకు ముందు నానీకి రెండోసారి ఎంపీ టికెట్ ఇవ్వాలా వద్దా ? అన్నదానిపై టీడీపీలో పెద్ద చర్చలే నడిచాయి. చంద్రబాబు... లోకేష్ నానీకి తిరిగి సీటు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు అన్న ప్రచారం నడిచింది. టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండగానే అనేక విషయాల్లో నానికి.. చంద్రబాబుకు మధ్య గ్యాప్ వచ్చింది. అందుకే విజయవాడ ఎంపీగా తమ చెప్పుచేతల్లో ఉండే మనిషి అయితేనే కరెక్ట్ అని చంద్రబాబు - చినబాబు ఇద్దరూ భావించారు.అయితే వ్యక్తిగత ఇమేజ్ నాని సొంతం కావడంతో ఆయనను తప్పించే సాహసం చేయలేకపోయారు. ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయినా విజయవాడ ఎంపీగా నాని వరుసగా రెండోసారి విజయం సాధించి తన ప్రజాబలాన్ని చాటుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి సోషల్ మీడియాలో పార్టీకి ఇబ్బంది కలిగించేలా నాని వ్యాఖ్యలు చేస్తున్నారు. బాబుపై నాని కోపానికి చాలా కారణాలే ఉన్నాయి. ఎన్నికల్లో గెలిచిన తనను కాదని.. ఓడిన మాజీ మంత్రి ఉమాకు ప్రయార్టీ ఇవ్వడంతో పాటు పార్టీ కార్యకలాపాల కోసం ముందుగా తన ఆఫీస్ ఓకే చేసి ఆ తర్వాత గొల్లపూడికి మార్చేయడం. దీని వెనక ఉమా హస్తం ఉందన్న అనుమానం కూడా నానికి ఉంది.

ఇక నాని తాజా ట్వీట్ చూస్తే ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో పాటు లోకేష్ కు కూడా సూటిగా తగిలేలా ఉంది.  నాని చేసిన ట్వీట్ చూస్తే ‘నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు - నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు - నాలుగు వాక్యాలు రాయలేనివాడు - ట్వీట్ చేస్తున్నాడు. దౌర్భాగ్యం!” అంటూ ట్వీట్ పెట్టారు కేశినేని నాని.

ఈ ట్వీట్ చూస్తూ బుద్ధా వెంకన్నతో పాటు లోకేష్ ను ఉద్దేశించే పెట్టారని టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. నాలుగు పదాలు చదవలేని వాడు.. రాయలేని వాడు... నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు పదవులు పట్టేస్తున్నాడు అంటే ఈ పదాలన్ని కూడా అటు  లోకేష్ తో పాటు ఇటు వెంకన్నకూ వర్తించేలా ఉన్నాయి. లోకేష్ కు పదాలు పలకడం రాదన్న సంగతి అందరికి తెలిసిందే. ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు... అయినా ఎమ్మెల్సీ పదవిని అంటిపెట్టుకునే వేలాడుతున్నారు.

ఇక బుద్ధా వెంకన్న కూడా ఓట్లు లేకపోయినా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తా లేని వ్యక్తి అని టీడీపీ వాళ్లే ఒప్పుకుంటారు. ఇక కేశినేనికి లోకేష్ పై పాత కోపం ఎలాగూ ఉంది. మరి ఇప్పుడు వెంకన్నతో కొత్త గొడవ ఏంటంటే విజయవాడ టీడీపీలో పెత్తనం చెలాయించేందుకు బుద్దా వెంకన్న ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో కేశినేని వెంకన్నను టార్గెట్ గా చేసుకునే ఈ ట్వీట్ పెట్టాడని టీడీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు.

విజయవాడ పశ్చిమ సీటు విషయంలో ఇటీవల కేశినేని మాట్లాడుతూ నాగూర్ మీరాను వచ్చే ఎన్నికల్లో పశ్చిమ ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నా అంటూ ఇటీవల కేశినేని నాని టీడీపీ నేతల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇది వెంకన్నకు మండేలా చేసింది. ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా సీటు రాలేదు. ఇప్పటకి అయినా అక్కడ పాగా వేయాలని చూస్తున్నారు. నాని కూడా అక్కడ తన వర్గానికి చెందిన వ్యక్తికే సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య వార్ ముదిరి పాకాన పడింది.