కరోనా బాధితులకు కేరళ చికిత్సకు ఏపీ కసరత్తు?

Mon Sep 13 2021 09:35:05 GMT+0530 (IST)

Kerala Treatment for Corona Patients

కరోనా బాధితులకు కేరళలో అనుసరించిన వైద్య విధానాన్ని ఏపీలో అమలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తొలి వేవ్ సందర్భంలో కేరళ రాష్ట్ర సర్కారు అనుసరించిన ఇన్ హేలర్ స్టెరాయిడ్స్ ను ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు. సాధారణంగా ఆస్తమా పేషెంట్లు ఎక్కువగా ఇన్ హేలర్ ద్వారా మందును పీల్చుకొని ఆస్తమాను కంట్రోల్ లో ఉంచుకుంటారు. ఇందుకు భిన్నంగా కేరళలో మొదటి వేవ్ సందర్భంగా ఇంట్లో ఉండి రికవరీ అవుతున్న కరోనా పేషెంట్లు పలువురికి ‘‘బుడొజినైట్’’ స్టెరాయిడ్ ను ఇన్ హేలర్ ద్వారా ఇచ్చారు.ఈ మధ్యన ఏపీ వైద్య  బృందం కేరళకు వెళ్లినప్పుడు ఈ అంశం పరిశీలనకు వచ్చింది. దగ్గు తీవ్రంగా ఉండి.. ఆక్సిజన్ లెవెల్స్ 94 కంటే తక్కువకు పడిపోయినప్పుడు ఇన్ హేలర్ స్టెరాయిడ్స్ ను కేరళ వైద్యులు ఇచ్చారు. ఇది అక్కడ బాగానే వర్కువుట్ అయినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదే వైద్య విధానాన్ని ఏపీలోనూ అనుసరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను ఏపీ ప్రభుత్వం  చేస్తోంది.

ఇన్ హేలర్ స్టెరాయిడ్స్ వినియోగం ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఇలా వాడితే ఎంతవరకు కరొనా కంట్రోల్ లోకి వస్తుంది? లాంటి అంశాల్ని తొలుత అధ్యయనం చేయనున్నారు. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుసరిస్తున్న వైద్య విధానం విషయానికి వస్తే స్టెరాయిడ్స్ ను నరాల ద్వారా పంపిస్తున్నారు. అందుకు భిన్నంగా నోరు.. ముక్కు ద్వారా పీల్చితే ఎంతమేర పని చేస్తాయన్నది చూడనున్నారు.

అయితే.. ఈ విధానాన్ని ఏ తరహా పేషెంట్లకు అమలు చేయాలన్నది కూడా ఒక చర్చగా మారింది. కేసులు ఎక్కువగా ఉండి.. పరిస్థితి తీవ్రంగా ఉన్న వేళలో మాత్రమే ఈ విధానాన్ని అమలు చేయాలా? అన్న దానిపైనా ఫోకస్ పెడుతున్నారు. సాధారణ పేషెంట్లకు ఈ వైద్య విధానం అవసరం లేదన్న మాట వినిపిస్తోంది. అయితే.. కేరళ తరహా వైద్యానికి సంబంధించిన ఎలాంటి రికార్డులు లేకపోవటంతో.. ఇదెంత వరకు సరైనదన్న దానిపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి.. ఫలితాలు సానుకూలంగా ఉంటే.. నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో ఏపీ సర్కారు ఉన్నట్లు చెబుతున్నారు.