Begin typing your search above and press return to search.

పోలీస్ బాస్ నే సీన్లోకి తీసుకొచ్చిన సైకో సీరియల్ కిల్లర్

By:  Tupaki Desk   |   12 Oct 2019 2:13 PM GMT
పోలీస్ బాస్ నే సీన్లోకి తీసుకొచ్చిన సైకో సీరియల్ కిల్లర్
X
రీల్ లైఫ్ లో చోటు చేసుకున్న పరిణామాలు రియల్ లైఫ్ లో చోటు చేసుకుంటాయి. తాజాగా కేరళ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు రీల్ లైఫ్ లోనూ చోటు చేసుకోనివి కావటం విశేషం. పద్నాలుగేళ్ల వ్యవధిలో ఆరు హత్యలకు పాల్పడిన సైకో సీరియల్ కిల్లర్ వ్యవహారం తెలిసిందే. ఆస్తి కోసం సైనేడ్ ను మటన్ సూప్ లో కలిపేసి ఒకరి తర్వాత ఒకరు చొప్పున ఆరుగురిని చంపేసిన జాలీ వ్యవహారంలో కేరళ రాష్ట్ర పోలీస్ బాస్ లోక్ నాథ్ బెహ్రా స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.

మొదటి హత్యకు చివరి హత్యకు మధ్య పద్నాలుగేళ్ల గ్యాప్ ఉండటంతో హత్యలకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు కష్టమవుతుందని చెబుతున్నారు. చివరి హత్య జరిగి కూడా దాదాపు మూడేళ్లు కావటంతో.. నేరాన్ని నిరూపించటం అంత తేలికైన విషయం కాదంటున్నాయి అక్కడి పోలీసు వర్గాలు.

చాలా ముఖ్యమైన కేసు కావటంతో తాను వచ్చినట్లు చెప్పిన ఆయన.. ఈ కేసు అత్యంత సవాలుతో కూడుకున్నదిగా అభివర్ణించారు. మొత్తం ఆరు హత్యలు జరిగాయి కాబట్టి.. మొత్తం ఆరు హత్యల్ని విడివిడిగా విచారించాల్సి ఉంటుందన్నారు. ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో సైకో కిల్లర్ జాలీని తాను సైతం ప్రశ్నించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. సాధారణంగా కేసు ఏదైనా.. ఒక రాష్ట్ర పోలీస్ బాస్ స్వయంగా రంగంలోకి దిగి.. నేరస్తుల్ని విచారించటం.. ప్రశ్నించటం చాలా అరుదుగా జరిగే ప్రక్రియగా చెప్పాలి. జాలీ కారణంగా ఇలాంటి అరుదైన పరిణామం కేరళలో చోటు చేసుకోనుంది.