Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్.. షర్మిల నోటికి ఫెవికాల్

By:  Tupaki Desk   |   23 Jun 2021 7:30 AM GMT
కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్.. షర్మిల నోటికి ఫెవికాల్
X
అందుకే అంటారు నోటి నుంచి వచ్చే మాట ఆచితూచి అన్నట్లు ఉండాలని. అందునా బలమైన శత్రువు.. తెలివైన ప్రత్యర్థితో తలపడేటప్పుడు నాలుగు కాదు నలభై అడుగులు ముందుకేసి ఆలోచించి మాట్లాడాలి. అనవసరమైన ఆవేశం తప్పించి.. ఆలోచన లేని పిల్లల కారణంగా తల్లిదండ్రులు మాటలు పడాల్సి వస్తుందంటే ఏమో అనుకుంన్నాం. తాజాగా వైఎస్ షర్మిల ఎపిసోడ్ లో అది నిజమనిపించక మానదు.

తెలంగాణలో పార్టీ పెట్టాలని డిసైడ్ అయిన షర్మిల.. అందుకు తగ్గట్లే రాజకీయ ఎత్తుల్ని సిద్ధం చేసుకున్నారని అందరూ భావించారు. కానీ.. ఆమె మాటలు.. చేతలు.. వేసిన ఎత్తులు.. చేపట్టిన కార్యక్రమాల్ని చూసినప్పుడు ఆమె తేలిపోవటమే కాదు.. ఆమె కారణంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బద్నాం అవుతారన్న అనుమానం ఇప్పుడు నిజమైంది. వెనుకా ముందు చూసుకోకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేశారు.

గిప్టుకు రిటర్న్ గిప్టు ఇవ్వటం బాగా తెలిసిన కేసీఆర్.. షర్మిల మాటల్ని చూస్తూ ఊరుకోరు కదా? అంతకంతకూ.. వడ్డీతో సహా ఇవ్వాలనే అనుకుంటారు.అందుకు తగ్గట్లే.. తాజాగా ఆయన ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కు షర్మిల విలవిలలాడిపోయే పరిస్థితి. ఎవరినైనా.. ఎంతటి వారినైనా సరే.. తన మాటతో వారికి చుక్కలు చూపించొచ్చని భావించిన షర్మిల.. అనూహ్యంగా ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయించాల్సి వస్తోంది. దీనికి కారణం.. ఇప్పుడు కానీ ఆమె నోరు తెరిచి మాట్లాడితే తెలంగాణలో ఆమె రాజకీయ ఆస్తిత్వం ప్రశ్నార్థకంలో పడే ప్రమాదం ఉంది.

అందుకే ఆమె మౌనంగా ఉంటున్నారు. క్రిష్ణా జలాల్నిఏపీ దోచుకుంటుందని.. వైఎస్ నీటి దొంగ అయితే.. జగన్ గజదొంగ అని తెలంగాణ మంత్రి వ్యాఖ్యానిస్తే.. ఆ మధ్యన జగన్ ను ఉద్దేశించి కేబినెట్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలన్ని పరోక్షంగా షర్మిలకు షాకిచ్చే పనిలో భాగమనే చెబుతున్నారు. తెలంగాణలో రాజకీయం అంత తేలికైన విషయం కాదన్న విషయాన్ని తాజా ఎపిసోడ్ తో ఆమెకు అర్థమయ్యేలా చేశారు కేసీఆర్.

ఏపీలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు అక్రమమన్న కేసీఆర్ మాటను విభేదించినా.. దివంగత మహానేత వైఎస్ పై అన్నేసి మాటల్ని అన్నా.. దానికి రిటార్టు ఇచ్చేందుకు నోరు విప్పినా.. జరిగే నష్టం ఏమిటో షర్మిలకు తెలుసు. అందుకే ఆమె మౌనంగా ఉండిపోయారు. ఇన్నాళ్లు తనను అన్నేసి మాటలు అంటున్న షర్మిలకు ఒక్క ఎత్తుతో నోట మాట రాకుండా చేసిన కేసీఆర్ తెలివే తెలివి. గులాబీ బాస్ ను తక్కువగా అంచనా వేసే వారికి తాజా ఉదంతం ఒక చక్కటి గుణపాఠమన్న మాట వినిపిస్తోంది.