Begin typing your search above and press return to search.

పార్టీ పేరు మార్చాలంటే ఏమేం చేయాల్సి ఉంటుంది?

By:  Tupaki Desk   |   5 Oct 2022 10:30 AM GMT
పార్టీ పేరు మార్చాలంటే ఏమేం చేయాల్సి ఉంటుంది?
X
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితి పేరుగా మార్చాలని పార్టీ అధినేత కమ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. చేతిలో అధికారం ఉన్న నేపథ్యంలో తాను అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేయటానికి అవసరమైన అన్ని హంగులు ఇవాల్టి రోజున కేసీఆర్ వద్ద ఉన్నాయి.

దీంతో.. జాతీయ పార్టీని యుద్ధ ప్రాతిపదికను ఏర్పాటు చేయటమే కాదు.. పార్టీ ప్రకటనకు ముందే తన దేశ వ్యాప్త పర్యటనలకు అవసరమై చిట్టి విమానాన్ని కొనుగోలు చేసే విషయం బయటకు వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఇప్పటివరకు టీఆర్ఎస్ అని ఉన్న పార్టీ ఇకపై బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పార్టీ పేరును ప్రకటించే వీలుందన్న మాట వినిపిస్తోంది.

మరి.. ఒక పార్టీకి అప్పటికే ఉన్న పేరును తీసివేసి.. దాని స్థానంలో మరో పేరు ఎలా పెడతారు? అందుకు ఉండే ప్రాసెస్ ఏమిటి? లాంటి అంశాల్ని చూస్తే..

- ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం కొన్ని సందర్భాల్లో పార్టీలు ప్రత్యామ్నాయ పద్దతిలోపార్టీ పేరు మార్చుకోవాల్సి వ్సతుంది. చట్టంలోని సెక్షన్ 29ఏ ప్రకారం ఒక రాజకీయ పార్టీ తన పేరును సవరించుకునే వీలుంది.

- రాజకీయ పార్టీలు తమ పేర్లను ఎప్పుడైనా మార్చుకునే అవకాశం ఉంటుంది. పార్టీలు పేరు మార్చుకోవాలంటే పార్టీ సర్వ సభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి.. తీర్మానం చేయాలి. అనంతరం ఆ కాపీని ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా పంపాల్సి ఉంటుంది. అవసరమైతే.. ఈసీకి ఇచ్చే వీలుంది.

- ఎన్నికల సంఘానికి సమర్పించిన లేఖపై ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలంటూ నోటిఫకేషన్ విడుదల చేస్తారు. అందుకు నెల రోజులు గడువు విధిస్తారు.

- గడువు ముగిసిన తర్వాత ఎలాంటి అభ్యంతరాలు రాని పక్షంలో తుది నిర్ణయం వెలువరించొచ్చు.

- దాంతో కొత్త పేరు అధికారికంగా మనుగడలోకి వస్తుంది.

- గతంలో టీఎంసీ (త్రణమూల్ కాంగ్రెస్ పార్టీ) పేరు ముందు అఖిల భారత అనే పేరును చేర్జి జాతీయ పార్టీగా తీర్మానం పంపారు. దాన్ని ఈసీ ఆమోదించి గుర్తించింది.

- ఎన్సీ.. ఎన్పీపీ లాంటి పార్టీలు కూడా ఇదే తరహాలో గుర్తింపు పొందాయి. ఇప్పుడు టీఆర్ఎస్ సైతం ఇలానే జాతీయ ప పార్టీ హోదాను సొంతం చేసుకోనుంది.

- టీఆర్ఎస్ అప్లికేషన్ కు ఎన్నికల సంఘం ఆమోదం తెలియజేస్తే.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కొత్త పేరుతో ఎన్నికల గోదాలోకి దిగే వీలుంది.

కొత్తగా పేరు పెట్టే పార్టీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే.. అప్పటికే మనుగడలో ఉన్న మరో రాజకీయ పార్టీ పేరును కానీ.. దాన్ని ప్రభావితం చేసే పేరును కానీ కొత్త పార్టీ పేరును పెట్టకూడదు. పార్టీ పేరును హిందీ.. ఇంగ్లిష్ లేదంటే ఏదైనా ప్రాంతీయ భాషలో అయినా నిర్ణయించుకునే హక్కు ఉంటుంది.

అయితే.. ఒక పార్టీ పేరును అనువదించాక.. మరోపార్టీ పేరు స్ఫురణకు వచ్చేలా కానీ.. పాపులర్ అయిన పార్టీ పేరు గుర్తుకు వచ్చేలా మాత్రం ఉండకూడదు. అలా ఉంటే.. ఆ విన్నపాన్ని ఆమోదించరు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.