Begin typing your search above and press return to search.

కౌశిక్ కు అంత అర్జెంట్ గా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టటం ఎందుకు?

By:  Tupaki Desk   |   2 Aug 2021 5:43 AM GMT
కౌశిక్ కు అంత అర్జెంట్ గా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టటం ఎందుకు?
X
పదవులు ఇచ్చే విషయంలో తెలంగాణ రాష్ట్ర సమతి అధ్యక్షుడు కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత పిసినారితనంతో వ్యవహరిస్తారో తెలిసిందే. సుదీర్ఘకాలం పాటు విపక్షంలో ఉండి.. లక్కీగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. విపక్షంలో ఉన్నప్పుడు పదవుల్ని ఇవ్వటం సాధ్యం కాదు. మరి.. అధికారంలోకి వచ్చాక అయినా వరుస పెట్టి పదవులు ఇవ్వటం ద్వారా.. పార్టీని పవర్లోకి తెచ్చిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందన్న ఆశ కాస్తా ఆడియాస అయినట్లేనన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

కేసీఆర్ బంగారు తెలంగాణ కల సాకారం చేసేందుకు వివిధ పార్టీల నుంచి వచ్చిన నేతలు పలువురికి పదవులు రావటం.. మొదట్నించి టీఆర్ఎస్ లో ఉండి.. గులాబీ జెండా మోసిన వారికి పెద్దగా పదవులు దక్కలేదన్న విమర్శ ఉంది. అన్నింటికి మించి.. తెలంగాణ కల సాకారం కావటం కోసం తెలంగాణ బిడ్డలు పలువురు అదే పనిగా ఆత్మహత్య చేసుకోవటం కూడా ప్రధాన కారణం. కానీ.. ఆ కుటుంబాలకు చెందిన ఎవరికి రాజకీయ పదవులు దక్కలేదు. నోరు తెరిచి అడిగిన శ్రీకాంతాచారి తల్లికి మొండిచేయి చూపించటం కేసీఆర్ పట్ల తెలంగాణ వాదుల్లో కినుకు కొట్టొచ్చినట్లుగా చెబుతారు.

పదవుల పంపకం విషయంలో కేసీఆర్ తీరును తప్పు పడుతుంటారు. ఇస్తామంటూనే ఇవ్వకుండా నామినేటెడ్ పోస్టుల్నితన దగ్గర ఉంచుకునే ఆయన.. అవసరమైన వారికి మాత్రం ఆగమేఘాల మీద పదవుల్ని ఇచ్చేస్తారని చెప్పాలి. దీనికి చక్కటి ఉదాహరణగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ను చెప్పాలి. ఆయన పార్టీలోకి చేరినంతనే మంత్రి పదవిని ఇవ్వటం ద్వారా.. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బీసీల్లో బలమైన సామాజికవర్గంలో శక్తివంతమైన నేతగా.. మాస్ లీడర్ గా గుర్తింపు ఉన్న ఆయనకు మంత్రి పదవిని ఇచ్చేసిన తీరు.. టీఆర్ఎస్ లో ఎప్పటినుంచో ఉన్న పలువురు నేతలకు మింగుడుపడని రీతిలో మారింది.

తాజాగా పాడె కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ కట్టబెడుతున్న వైనం ఇదే తీరులో ఉందని చెప్పాలి. అయితే.. కౌశిక్ రెడ్డికి పదవి ఇవ్వటం వ్యూహాత్మకమేనని చెప్పాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా చెప్పి.. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆయనకు బదులుగా మరొకరిని ఎంపిక చేయక తప్పనిపరిస్థితి. ఇలాంటివేళ.. కౌశిక్ ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించకుండా.. పదవి ఇవ్వకుండా ఉండటం కష్టం. ఆయన ఏ మాత్రం నారాజ్ చేసినా.. మొదటికే మోసం రావటం ఖాయం. అందుకే.. మధ్యే మార్గంగా కౌశిక్ ను ఎమ్మెల్సీగా చేసేసి.. ఆయన్ను ఇన్ స్టెంట్ గా ప్రజాప్రతినిధిగా చేయటం.. పదవితో వచ్చే శక్తియుక్తుల్ని ఉప ఎన్నికల్లో వినియోగించుకోవాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.

ఎలాంటి పదవి ఇవ్వకుండా.. ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించకుండా ఉండకుండా ఎన్నికలకు వెళితే.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందన్న ఆలోచనతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే కావాలని కలలు కనే కౌశిక్ కు.. ఎమ్మెల్సీ కావటం ఒకింత ఇష్టం లేకున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే సేఫ్ అన్నట్లుగా బుజ్జిగించే వీలుందని చెబుతున్నారు. ప్రత్యర్థులపై ఆయుధంగా ప్రయోగించాలని భావిస్తున్న కౌశిక్ అస్త్రం ఏ మాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం వస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే.. ఎలాంటి రిస్కు తీసుకోకుండా.. ఎమ్మెల్సీ పదవిని అప్పగించటం ద్వారా సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలన్నదే కేసీఆర్ వ్యూహమని చెబుతున్నారు.