Begin typing your search above and press return to search.

కవిత ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా?

By:  Tupaki Desk   |   13 Oct 2020 5:30 PM GMT
కవిత ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా?
X
నిజామాబాద్‌ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 14వ తేదీ బుధవారం ఉదయం 11గంటలకు శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, కవిత ప్రమాణ స్వీకారం కార్యక్రమం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను 5 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండబోతున్నానని, తనను కలిసేందుకు కార్యకర్తలు రావద్దని కవిత తాజాగా ట్వీట్ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నకు కరోనా పాజిటివ్ వచ్చిందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కవిత ట్వీట్ చేశారు. ఇటీవల జరిగిన కౌంటింగ్ సందర్భంగా కవితను సంజయ్ కలవడంతో ముందు జాగ్రత్త చర్యగా కవిత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బుధవారం మండలి సమావేశం ఉండటంతో ఆమె ఎమ్మెల్సీగా ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే, ప్రమాణ స్వీకారం కార్యక్రమం వాయిదా గురించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 823ఓట్లకు గాను 728 ఓట్లను కైవసం చేసుకున్న కవిత ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ ఎమ్మెల్సీ స్థానానికి మరో 15 నెలల కాలం ఉన్నప్పటికీ కవితను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఇంత తక్కువ వ్యవధి కోసం కవితను మంత్రిని చేసేందుకు కేసీఆర్ సుముఖంగా ఉంటారా లేదా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు, ఇప్పటికే ఫుల్ అయిన మంత్రివర్గంలో కవితకు స్థానం దక్కుతుందా....ఒక వేళ దక్కితే ఎవరిపైన అయినా వేటు పడుతుందా అన్న చర్చ టీఆర్ఎస్ శ్రేణుల్లో జరుగుతోంది.