ఒక్క ట్వీట్ తో మొత్తం లెక్క మారిందా? కవితకు కొత్త చిక్కులు?

Thu Dec 01 2022 14:20:05 GMT+0530 (India Standard Time)

Kavita Kalvakuntla Tweet on YS Sharmila and BJP

గతంలో రాజకీయ పరిణామాలు నేతలు చేసే మాటలతోనూ.. మీడియా వద్ద ప్రస్తావించిన అంశాలతో మారుతూ ఉండేవి. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాము పెట్టుకున్న రాతగాళ్లు తమ మెదడుకు పని పెట్టి..ఎప్పుడేం పోస్టు చేస్తే బాగుంటుందన్న సూచనతో పాటు.. అందుకు తగ్గట్లుగా పోస్టులు పెట్టి వాతావరణాన్ని వేడెక్కించటం ఇప్పుడో అలవాటుగా మారింది.బుధవారం ఉదయం ఎమ్మెల్సీ కవిత ట్విటర్ ఖాతా నుంచి  తాము వదిలిన "బాణం".. తానా అంటే తందానా అంటున్న "తామర పువ్వులు"అంటూ కవిత తన ట్వీట్ తో షర్మిలను కెలికేశారు. షర్మిల ఒక్కరే కాదని.. ఆమె వెనుకుండి కథ నడిపిస్తున్నది బీజేపీ అన్న భావన వచ్చేలా ఆమె ట్వీట్ ఉంది. దీనికి ప్రతిగా షర్మిల రెట్టించిన ఉత్సాహంగా ట్వీట్ చేసి.. తమలపాకుతో ఒకటిస్తే.. తలుపుచెక్కతో బదులిస్తా అన్న చందంగా ట్వీట్ తో షాకిచ్చారు.

ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఎవరైనా ఏమైనా అనేందుకు చాలామందికి ధైర్యం చాలదు. దీనికి కారనం.. ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల తనయ కావటంతో పాటు.. ఆమె మహిళ కావటంతో లేనిపోని తలనొప్పులు ఎందుకన్నట్లుగా చాలామంది రియాక్టు కాకుండా మౌనంగా ఉంటారు. అప్పుడప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ మాత్రం కాస్తంత ఘాటుగా విమర్శలు చేస్తారు తప్పించి.. మిగిలిన వారెవరూ ఆ సాహసం చేయరు.

అయితే.. షర్మిలకు ఆ ఇబ్బందులులేకపోవటం.. తనను ఉద్దేశించి అంత మాట అన్న కవితకు ధీటుగా ఆమె రియాక్టు అవుతూ.. ''పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో 'కవిత'లకు కొదవ లేదు'' అంటూ  ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. తన ఉద్యమాల బ్యాకగ్రౌండ్ ను ఇప్పటివరకు టచ్ చేయని వారికి భిన్నంగా.. పాదయాత్రలు చేయలేదు.. పనితనం లేదన్న మాటతో పాటు టీఆర్ఎస్ పార్టీని గులాబీ తోటలా.. కవితను కవితలు చెప్పేవారిగా అభివర్ణించిన తీరు ఆమెకు షాకిచ్చేలా మారిందంటున్నారు.

ఇప్పటివరకు తాము చెలరేగిపోవటం.. ఎదుటి వారు మౌనంగా ఉండటం ఒక అలవాటుగా ఉన్న దానికి భిన్నంగా.. మాటకు మాట అన్నట్లు షర్మిల చేసిన ట్వీట్  వైరల్ గా మారింది. కవితను ఇంత సింఫుల్ గా..  సూటిగా ఎవరూ అనకపోవటంతో కూడా అందరిని ఆ ట్వీట్ మీద చూపు పడేలా చేసిందంటున్నారు.

ఈ ట్వీట్ తో కవితను కూడా అనొచ్చు.. ఎలా టార్గెట్ చేయొచ్చు? అన్న దానికి ప్రతిరూపంగాషర్మిల ట్వీట్లు నిలిచాయని చెబుతున్నారు. షర్మిల ట్వీట్ కవితకు ఇబ్బందిగా మారిందన్న మాట వినిపిస్తోంది. మరికొందరు అయితే.. తొందరపడి కెలికి మరీ సమస్యల్ని కవిత కొని తెచ్చుకున్నారన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ట్వీట్ల  వార్ మరింత ముదిరేదే తప్పించి తగ్గేది మాత్రం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.