Begin typing your search above and press return to search.

మోడీని టార్గెట్ చేయటానికి 8 ఏళ్లు.. 9 రాష్ట్రాలు లెక్క సరిపోయేనా కవిత?

By:  Tupaki Desk   |   1 Dec 2022 8:46 AM GMT
మోడీని టార్గెట్ చేయటానికి 8 ఏళ్లు.. 9 రాష్ట్రాలు లెక్క సరిపోయేనా కవిత?
X
ఈడీ.. బోడీ.. అంటూ తన తండ్రి కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటిని నుంచి వచ్చే మాటను యథాతధంగా వాడేస్తున్నారు ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్. ఇప్పుడు వారి బాటలోనే నడుస్తున్నారు సీఎం కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత. తాజాగా ఆమె మాట్లాడుతూ ప్రధాన నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. ఈడీ బోడీ అంటూ ఫైర్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు ఉందన్న మాట తాజాగా ఈడీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన నేపథ్యంలో కవిత మాట్లాడారు.

గురువారం ఉదయం కవిత ఇంటికి టీఆర్ఎస్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. అయితే.. స్థానిక నాయకులు ఇందులో కీలక భూమిక పోషించినట్లు చెబుతున్నారు. ఇదిలాఉంటే.. వారిని ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో కవిత ప్రధానిపై తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేశారు.

ఎన్నికల ముందు ఇలాంటివి చేయటం కేంద్రంలోని అధికారపక్షానికి మామూలే అని వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చొన్న ఎనిమిదేళ్లలో దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లోని ప్రభుత్వాల్ని కూల్చేసిన ఘనత మోడీ సర్కారుకే దక్కుతుందని వ్యాఖ్యానించారు.

అయితే.. కవిత చేసిన ఆవేశపూరిత ప్రసంగంలో పలు లోపాల్ని ఎత్తి చూపుతున్నారు. తొమ్మిది రాష్ట్రాల్లోని ప్రభుత్వాల్ని కూల్చేశారన్నంతనే.. కేసీఆర్ ఏమీ తక్కువ కాదు కదా? మొదటి దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత.. రెండో దఫాలోనూ వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల్ని పార్టీలోకి తీసుకురావటం ద్వారా ఆయాపార్టీలు కోలుకోకుండా చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్న మాటను గుర్తు చేస్తున్నారు.

ప్రభుత్వాల్ని కూల్చటం.. ఇతర పార్టీల నేతల్ని పార్టీలోకి చేర్చుకోవటంలాంటివి పెద్ద విషయాలుగా ఇప్పుడు ఎవరూ పట్టించుకోవటం లేదు. దీనికి కారణం.. అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా అంత మడి కట్టుకొని కూర్చోలేదన్నది మర్చిపోకూడదు. ఈ కారణంగా..ప్రధాని నరేంద్ర మోడీపై కవిత చేసిన విమర్శల్ని ఎవరూ సీరియస్ గా తీసుకోరంటున్నారు.

దీనికి మించి ఇంకేమైనా కొత్త సంగతుల్ని ప్రస్తావించి ఉంటే బాగుండేదంటున్నారు. విలువల గురించి మాట్లాడే వేళలో.. తాము ఎంత విలువలతో కూడిన రాజకీయాల్ని చేశామన్న విషయాల్ని మర్చిపోకూడదంటున్నారు. మొత్తంగా.. పాత చింతకాయ పచ్చడి మాదిరి ఉన్న కవిత మాటల్లో ఆవేశపు పోపు ఎంత పెట్టినా ప్రయోజనం ఉండదంటున్నారు. కవిత నోటి నుంచి తొమ్మిది రాష్ట్రాల గురించి ప్రస్తావించినంతనే.. తెలంగాణ రాష్ట్రంలోనూ ఇలాంటి చాలానే జరిగాయి కదా? అన్న మాటను వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.