Begin typing your search above and press return to search.

ఈటల తన హత్యకు కుట్ర పన్నారు...కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు !

By:  Tupaki Desk   |   20 July 2021 12:30 PM GMT
ఈటల తన హత్యకు కుట్ర పన్నారు...కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు !
X
తెలంగాణ లో వరుసగా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుండి ఐదారు నెలల తేడా తో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం తెలంగాణ ఫోకస్ మొత్తం , ఈ మధ్యనే అధికార టీఆర్ ఎస్ పార్టీ కి రాజీనామా చేసి ,భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గమైన హుజురాబాద్ పై పడింది. అయన పార్టీ నుండి బయటకి వెళ్లగానే రాజీనామా చేయడం తో ఆ శాసనసభ స్థానం ఖాళీ అయింది. దీనితో ఈ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక నిర్వహించబోతున్నారు.

అయితే, ఆ హుజురాబాద్ ఉప ఎన్నిక పై ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకమునుపే ఆ నియోజకవర్గం లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. రోజురోజుకు ప్రధాన రాజకీయ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. తెలంగాణ లో ప్రధాన పార్టీలైన టిఆర్ ఎస్ , బీజేపీ , కాంగ్రెస్ విజయం కోసం ఎన్ని పాట్లు పడాలో అన్ని పాట్లు పడుతున్నాయి. విజయం తమదే అని గులాబీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక ఈటల రాజేందర్ తన ప్రజలు తన వెంటే ఉన్నారంటూ విజయం పై గట్టి విశ్వాసం తో ఉన్నారు. అలాగే తాజాగా ప్రజా దీవెన యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి భాద్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో జరగబోయే తోలి ఉప ఎన్నిక కావడంతో ఈ గెలుపుతో మళ్లీ తన ప్రస్థానాన్ని ప్రారంభించాలని రేవంత్ రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు.

అయితే , గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన టీఆర్ ఎస్ కి గట్టి పోటీనిచ్చిన కీలక నేత కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి , సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. దీనికి సంబంధించి ఆయనే ఈ విషయాన్ని స్వయంగా ప్రజలకి తెలియజేశారు. ఇదే సమయంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈటల రాజేందర్ తనను హతమార్చడానికి ప్రయత్నించారని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన
పాడి కౌశిక్ రెడ్డి
తీవ్ర ఆరోపణలు చేశారు.

2018లో మర్రిపల్లిగూడ అనే గ్రామంలో తనను చంపించే ప్రయత్నం చేసి ఈటల విఫలమయ్యారని కౌశిక్ రెడ్డి ఆరోపణలు గుప్పించాడు. తనను హతమార్చడం సాధ్యం కాకపోయినా మాజీ ఎంపీటీసీ బాలరాజ్‌ను మాత్రం హత్య చేశారని ఆరోపించారు. ఇదీ ఈటల రాజేందర్ నేర చరిత్ర అంటూ కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, టీఆర్ ఎస్ లో చేరేందుకు కౌశిక్ రెడ్డి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన రేపు అధికారికంగా టీఆర్ ఎస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోస‌మే టీఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నాన‌ని స్పష్టం చేశారు. బుధ‌వారం మ‌ధ్యామ్నం ఒంటి గంట‌కు తెలంగాణ భ‌వ‌న్‌ లో సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ ఎస్ పార్టీలో చేరనున్నట్టు వెల్లడించారు. టీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనే టీఆర్ఎస్ లో చేరడానికి కారణమని కౌశిక్ రెడ్డి వెల్లడించారు.