Begin typing your search above and press return to search.

ఆ ఎన్ కౌంటర్ పై ఎన్నో ప్రశ్నలు... సమాధానాలేవి?

By:  Tupaki Desk   |   25 Nov 2021 2:30 AM GMT
ఆ ఎన్ కౌంటర్  పై ఎన్నో ప్రశ్నలు...  సమాధానాలేవి?
X
జమ్మూ కశ్మీర్ లోని పూంఛ్ సెక్టార్ లో జరిగిన ఎన్ కౌంటర్ పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇందుకు కారణం ఈ ఎన్ కౌంటర్ లో కేవలం భారత సైనికులు మాత్రమే చనిపోవడం. సాధారణంగా ఎన్ కౌంటర్ జరిగినప్పుడు ఇరువైపులా ఉన్నవారికి కనీసం గాయాలైనా అవుతాయని... అయితే ఈ ఘటనలో మాత్రం కనీసం ఒక్క ఉగ్రవాది కూడా హతమైన దాఖలాలూ లేవని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా కనీసం గాయాలపాలైనట్లు కూడా ఆర్మీ అధికారులు ప్రకటించలేదు అంతేకాకుండా ఈ ఘటనలో సుమారు తొమ్మిది మంది భారతీయ జవాన్లు వీరమరణం పొందినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలో అనేక ప్రశ్నలు ఇటు చనిపోయినా జవానుల బంధువుల నుంచి... అటు సామాజిక కార్యకర్తల నుంచి వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్ నెలలో కేవలం రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో తొమ్మిది మంది మరణించడం అటు అధికార వర్గాల్లో కూడా కలకలం రేపింది.

కశ్మీర్ లోని పిర్ పంజల్ అనే అడవిలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ సమయంలోనే ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. సుమారు కొన్ని రోజులపాటు ఈ ఎన్ కౌంటర్ ను జరిపినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

భారత ఆర్మీ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం ఉగ్రవాదులు అక్కడ దాగి ఉన్నారనే సమాచారంతోనే కాల్పులు జరిగాయి. అయితే కనీసం ఒక్క ఉగ్రవాదం కూడా ఈ ఎన్ కౌంటర్ లో హతమార్చిన దాఖలాలూ లేవు. కనీసం గాయాలపాలైనట్లు కూడా అధికారులు పేర్కొనలేదు. ఈ క్రమంలోనే పలు అనుమానాలకు తావు ఏర్పడింది.

ఉగ్రవాదులు లేనట్లయితే తొమ్మిది మంది జవాన్లు ఎందుకు చనిపోయారు? అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. దీంతోపాటు సెర్చ్ ఆపరేషన్ పూర్తి స్థాయిలో ముగిసిన తర్వాత ఉగ్రవాదుల సమాచారంపై అధికారులు ఇప్పటి వరకూ స్పందించలేదు. అందుకే దీనిపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ ఎన్ కౌంటర్ జరిగే సమయానికి అధికారులు అక్కడ ఉన్న అటవీ ప్రాంతాన్ని అన్నివైపుల నుంచి పూర్తిగా కవర్ చేశారని సమాచారం. అయితే ఉగ్రవాదులు అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం ఏమాత్రం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎక్కడ దాగి ఉన్నా రు? అనే ప్రశ్న మరోసారి తలెత్తింది.

ఒకవేళ ఉగ్రవాదులు అడవి ప్రాంతం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే... వారు భద్రతా బలగాల దృష్టిలో పడకుండా ఉండటం అనేది అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతవరకు ఉగ్రవాదులు సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని అధికారులు పేర్కొనలేదు. ఫలితంగా దీనిని ఫేక్ ఎన్ కౌంటర్ గా ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుందని కొంతమంది ఆరోపిస్తున్నారు.

ఈ ఎన్ కౌంటర్ జరిగే సమయంలో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఒక ఖైదీని భద్రతా బలగాలు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారని సమాచారం. అయితే ఈ సమయంలో అతనిపై కూడా కాల్పులు జరిగాయని అధికారులు చెప్పారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించినట్లు పేర్కొన్నారు.

అతడిని బయటకు తీసుకు రావడానికి కారణం కశ్మీర్ లోయ గుండా ఉగ్రవాదులను దేశంలోకి తీసుకు వచ్చే ప్రణాళికను అతను సిద్ధం చేస్తారని చెప్పుకొచ్చారు. ఈ కారణంగానే అతన్ని ఆ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఇతని మరణంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

ఈ ఎన్ కౌంటర్ లో మరో కోణం కూడా దాగి ఉంది. జమ్ము కశ్మీర్ లోని చాలా ప్రాంతాల్లో ఉగ్రవాదులకు స్థానికులు మద్దతు ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో మాత్రం అటువంటి మద్దతు ఉండదని పోలీసులు మొదటి నుంచి భావిస్తున్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు అడవిలో దాక్కుని ఉంటారని చెప్పారు.

సాధారణంగా పాక్ సరిహద్దుల్లో ఉన్నటువంటి వివిధ సెక్టార్ లో నుంచి కశ్మీర్ లోయలోకి ఉగ్రవాదులు చొరబడుతుంటారు. దీనిని తిప్పికొట్టేందుకు భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేస్తుంటారు. అయితే పూంఛ్ సెక్టార్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఎన్ కౌంటర్ ప్రశ్నలతోనే మిగిలిపోయింది. వాటికి సమాధానాలు ఎప్పుడు దొరుకుతాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.