Begin typing your search above and press return to search.

ఆరు ప్రాణాలు తీసిన క‌స‌బ్ బ్రిడ్జ్ కు ఆ పేరెందుకు?

By:  Tupaki Desk   |   15 March 2019 4:24 AM GMT
ఆరు ప్రాణాలు తీసిన క‌స‌బ్ బ్రిడ్జ్ కు ఆ పేరెందుకు?
X
దేశ ఆర్థిక రాజ‌ధాని.. మ‌హారాష్ట్ర రాష్ట్ర రాజ‌ధాని ముంబ‌యిలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఒక పాద‌చారుల బ్రిడ్జ్ కూలిన ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మ‌హిళ‌లు.. ముగ్గురు పురుషులు ఉన్నారు. 31 మంది గాయాల‌పాల‌య్యారు. ఛ‌త్ర‌ప‌తి శివాజీ టెర్మిన‌స్ షార్ట్ క‌ట్ లో సీఎస్ టీ నుంచి అంజుమ‌న్ కాలేజీ.. టైమ్స్ ఆఫ్ ఇండియా భ‌వ‌నం వైపు వెళ్లే పాద‌చారుల కోసం ఈ వంతెనను ఏర్పాటు చేశారు.

ముంబ‌యిపై ఉగ్ర‌దాడులు జ‌రిగిన‌ప్పుడు ఉగ్ర‌వాది క‌స‌బ్ ఈ వంతెన మీద నుంచి వెళ్లిన‌ప్పుడే అత‌గాడు సీసీ కెమేరాల‌కు చిక్కారు. అప్ప‌టి నుంచి క‌స‌బ్ బ్రిడ్జ్ గా దీన్ని పిల‌వ‌టం మొద‌లైంది. ఆఫీసుల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఇళ్ల‌కు వెళ్లే హ‌డావుడిలో ఉన్న వేళ‌.. ఈ ఘోరం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం 7.30 గంట‌ల స‌మ‌యంలో బ్రిడ్జ్ మీద‌కు పాద‌చారులు వెళుతుండ‌గా.. ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది. దీంతో.. బ్రిడ్జ్ పై నుంచి ఒక్క‌సారిగా నేల మీద‌కు ప‌డ‌టం.. మ‌రికొంద‌రు శిధిలాల్లో చిక్కుకుపోయారు.

వాస్త‌వానికి బ్రిడ్జ్ కు స‌మీపంలోని ట్రాఫిక్ సిగ్న‌ల్ రెడ్ ప‌డ‌టంతో పెద్ద ఎత్తున ప్రాణ న‌ష్టం త‌ప్పింది. కూల‌టానికి కొద్ది క్ష‌ణాల ముందు రెడ్ సిగ్న‌ల్ ప‌డింది. గ్రీన్ సిగ్న‌ల్ ప‌డాల్సిన క్ష‌ణాల ముందే ఒక్క‌సారిగా వంతెన‌లోని కొంత భాగం కుప్ప‌కూలింది. ఒక విధంగా చెప్పాలంటే రెడ్ సిగ్న‌ల్ పెద్ద ఎత్తున ప్రాణన‌ష్టాన్ని మిగిల్చింది. ఒక‌వేళ రెడ్ సిగ్న‌ల్ ప‌డ‌కుండా ఉండి ఉంటే.. ప‌లు వాహ‌నాలు బ్రిడ్జ్ కింద చిక్కుకుపోయేవి.

ప్ర‌మాదం గురించి తెలిసిన వెంట‌నే విప‌త్తు నివార‌ణ బృందం త‌క్ష‌ణం రంగంలోకి దిగారు. స‌హాయ‌క చ‌ర్య‌ల్ని షురూ చేశారు. ప్ర‌ధాని మోడీ మొద‌లు ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌వీస్ వ‌ర‌కూ అధికార‌.. ప్ర‌తిప‌క్ష నేత‌లు త‌మ సంతాపాన్ని తెలియ‌జేశారు. జ‌రిగిన ఘ‌ట‌న‌కు విచారం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌ల చొప్పున న‌ష్ట‌ప‌రిహారాన్ని ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. నిజానికి గురువారం ఉద‌యం ఈ బ్రిడ్జ్ కు రిపేర్లు ప్రారంభించారు. సాయంత్రం ప్ర‌జ‌ల్ని అనుమ‌తించటం.. కొంత భాగం ఒక్క‌సారిగా కూలిపోవ‌టం జ‌రిగింది.