Begin typing your search above and press return to search.

జగన్ ఆలోచనతో వ్యాపారం చేస్తున్న కర్ణాటక

By:  Tupaki Desk   |   12 July 2020 5:30 AM GMT
జగన్ ఆలోచనతో వ్యాపారం చేస్తున్న కర్ణాటక
X
పది రూపాయిలు తక్కువకు వస్తుందంటే చాలు పరుగులు తీసే పరిస్థితి ఉన్నప్పుడు.. ఒక క్వార్టర్ మీద ఏకంగా రూ.285 ఆదా అవుతుందంటే.. ఎవరు మాత్రం వెనక్కి తగ్గుతారు చెప్పండి. ఏపీలోని కర్నూలు జిల్లా శివారులో ఉండే పట్టణం ఆదోని. కర్ణాటక సరిహద్దుకు కూతవేటు దూరంలో ఉండే ఈ పట్టణంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా.. కర్ణాటక రాష్ట్రానికే వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి ఈ ఉళ్లో.. గడిచిన నాలుగు రోజులుగా మందు బాబులంతా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇటికెల గ్రామానికి క్యూ కడుతున్నారు.

మొన్నటివరకూ ఆ ఊరిని లైట్ తీసుకున్న ఆదోని వాసులకు ఇప్పుడా ఊరు చాలా ముఖ్యమైనదిగా మారింది. దీనికి వారు చెబుతున్న కారణం విన్నప్పుడు నిజమే కదా? అనిపించక మానదు. 500 మంది మాత్రమే ఉండే ఆ ఉళ్లో.. ఇటీవల కర్ణాటక సర్కారు ఒక మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసింది. ఒక ప్రముఖ బ్రాండ్ మద్యం 180ఎం.ఎల్ కేవలం రూ.85 మాత్రమే. అదే సమయంలో ఈ ఊరికి పదిహేనుకిలోమీటర్లదూరంలో ఉండే ఆదోని పట్టణంలో ఇదే 180ఎంఎల్ మద్యం ధర ఏకంగా రూ.370.

అంటే క్వార్టర్ కు రూ.285 తేడా రావటంతో ఊళ్లోని మద్యం షాపుల్ని వదిలేసి.. ఇటికెల గ్రామానికి వెళ్లిపోతున్నారు. మొన్నటివరకు మండుతున్న రేట్లతో పొదుపుగా తాగినోళ్లు.. ఇప్పుడు కారుచౌకగా లభిస్తున్న మద్యంతో పండుగ చేసుకుంటున్నారు. ఈ మద్యం దుకాణం పుణ్యమా అని ఆదోని.. ఇటికెల గ్రామాల మధ్య కొత్తగా ఆటో సర్వీసులు మొదలుకొని కార్ల సర్వీసుల వరకూ వచ్చేశాయి.

పొద్దున.. సాయంత్రం.. రాత్రి అన్న తేడా లేకుండా.. ఈ రహదారి ఇప్పుడు మహా బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ మద్యం దుకాణం కారణంగా.. ఏపీ స్టేట్ కు రావాల్సిన కోట్లాది రూపాయిల ఆదాయం పోయినట్లేనని అధికారులు చెబుతున్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. మందుబాబులు మాత్రం మహా పండుగ చేసుకుంటున్నారని చెప్పక తప్పదు.