Begin typing your search above and press return to search.

కర్ణాటక హైటెన్షన్ కంటిన్యూస్..రిజల్ట్ రేపటికి వాయిదా?

By:  Tupaki Desk   |   18 July 2019 3:23 PM GMT
కర్ణాటక హైటెన్షన్ కంటిన్యూస్..రిజల్ట్ రేపటికి వాయిదా?
X
కన్నడనాట నెలకొన్న హైటెన్షన్ వాతావరణం గురువారంతో ముగుస్తుందనుకున్న వారి ఆశలు అడియాశలే అయ్యాయి. గురువారంతో జేడీఎస్ నేత కుమారస్వామి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని దించేసి తాను సీఎం కుర్చీ ఎక్కాలని బీజేపీ నేత - మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప వేసుకున్న ప్లాన్ వర్కవుట్ కాలేదు. అలాగని కుమారస్వామి సర్కారుకు గండం తప్పిందని చెప్పడానికి కూడా లేదు. గురువారంతో పడిపోతుందని వేసిన అంచనా... శుక్రవారానికో - ఆ మరునాటికో పోస్ట్ పోన్ అయ్యిందంతే. అయితే కీలక సమయంలో దొరికిన కొన్ని గంటల మేర అవకాశాన్ని కుమార ఎలా వినియోగించుకుంటారన్న విషయంపైనే ఆయన సర్కారు భవిత - యడ్డీ కల సాకారయ్యే అవకాశాలు ఆధారపడి ఉంటాయంతే. నిజమే... దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు గురువారం రచ్చరచ్చగా సాగినా... ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదని చెప్పాలి.

కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ సర్కారుకు క్లియర్ మెజారిటీ ఉన్నా... తుమ్మితే ఊడిపోయే పరిస్థితిని బీజేపీ చాలా తెలివిగానే తనకు అనుకూలంగా వాడుకుంది. అయితే ట్రబుల్ షూటర్ గా పేరున్న కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ రంగంలోకి దిగాక బీజేపీకి చుక్కలు కనిపించడం మొదలైందని చెప్పాలి. ఎందుకంటే తాను అనుకున్నట్లుగా సంకీర్ణ కూటమిలోని 16 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశాక - వారి రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్ పై ఒత్తిడి పెంచిన బీజేపీ... ఆ విషయంలో శివకుమార్ అడ్డు తగలడంతో కాస్తంత ఇబ్బంది పడిందనే చెప్పాలి. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల వ్యవహారాన్ని తేల్చేదాకా సంకీర్ణ కూటమికి పెద్దగా ఇబ్బందేమీ లేదనే చెప్పక తప్పదు. అయితే ఆ రాజీనామాలను సంకీర్ణ కూటమికి చెందిన స్పీకర్ అప్పటికప్పుడు తేల్చరు కదా. సంకీర్ణ కూటమి వేసిన ఈ ప్లాన్ ను తుత్తునీయలు చేసేందుకు బీజేపీ కూడా తనవంతు యత్నాలు చేసింది.

ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయగా... నిన్న రాత్రి కాంగ్రెస్ శిబిరంలోనే ఉన్న ఎమ్మెల్యే శ్రీకాంత పాటిల్ రాత్రికి రాత్రి ప్లేటు ఫిరాయించేశారు. బుధవారం రాత్రి కాంగ్రెస్ తోనే ఉన్న పాటిల్ గురువారం ఉదయానికి ముంబై ఆసుపత్రిలో ప్రత్యక్షమయ్యారు. దీనిపై సంకీర్ణ కూటమి తనదైన శైలిలో సభను స్తంభింపజేసింది. ఈ ఆందోళనలు ఓ వైపు కొనసాగుతుండగానే... గవర్నర్ ప్రతినిధి వచ్చి స్పీకర్ రమేశ్ కుమార్ తో భేటీ కావడం - గురువారం నాడే కుమార సర్కారు బలనిరూపణ పూర్తయ్యేలా చూడాలని కోరడం - దానిపైనా సంకీర్ణ కూటమి నిరసన వ్యక్తం చేయడం... మరోవైపు గురువారం రాత్రి ఎంత సమయమైనా బల నిరూపణ పూర్తి చేయాల్సిందేనని యడ్డీ డిమాండ్ చేయడం - దానిపై కుమారస్వామి విరుచుకుపడటం - యడ్డీ నిరసనకు దిగడంతో సభ నిజంగానే రణరంగాన్ని తలపించింది. మొత్తంగా ఉదయం ప్రారంభమైన సభ మూడు సార్లు వాయిదా పడగా... సాయంత్రం మరోమారు రచ్చ సాగడంతో సభను శుక్రవారానికి వాయిదా వేయడంతో బల నిరూపణ శుక్రవారానికి వాయిదా పడిపోయింది. సర్కారును కాపాడుకునేందుకు కుమార, కూల్చేందుకు యడ్డీ తమదైన శైలి యత్నాలు చేసినా... సభలో నెలకొన్న రచ్చను ఆసరా చేసుకుని సంకీర్ణ సర్కారుకు మరో రోజు ప్రాణం నిలిచినట్టైందని చెప్పక తప్పదు. మరి రేపు ఏం జరుగుతుందో చూడాలి.