శశికళ విడుదలకు బీజేపీ బ్రేకులు? అందులో నిజమెంతా..

Sat Nov 21 2020 19:40:32 GMT+0530 (IST)

BJP breaks Sasikala release? That's really it ..

కొద్దిరోజులుగా తమిళనాడులో చిన్నమ్మ వచ్చేస్తుందహో.. అని ఆమె మద్దతుదారులు అభిమానులు ఊదరగొడుతున్నారు. దినకరన్ అయితే తన పార్టీ తరఫున 60 చోట్ల శశికళ కు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కూడా చేపట్టారు. అయితే జైలు నుంచి ముందుగానే విడుదల ఇవ్వాలనుకుంటున్న శశికళ కు నిరాశే మిగిలేటట్లు కనిపిస్తోంది. తాజాగా కర్ణాటక హోంమంత్రి శశికళ ముందస్తు విడుదలయ్యే అవకాశం లేదని పూర్తి శిక్షాకాలం అనుభవించాల్సిందేనని వ్యాఖ్యలు చేయడంతో శశికళ విడుదల అనుమానంగా మారింది. కాగా ఆమె విడుదలయ్యేందుకు బీజేపీ అడ్డుపడుతోంది ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత శశికళకు కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష రూ.10 కోట్ల జరిమానా విధించింది. జయలలిత మరణించగా.. శశికళ 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇదే నేరంపై ఆమె బంధువులు ఇళవరసి సుధాకరన్ కూడా అదే జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు.

కాగా కోర్టు తీర్పు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండోవారంలో శశికళ నాలుగేళ్ల శిక్షాకాలం ముగుస్తుంది. సామాజిక కార్యకర్త నరసింహమూర్తి సమాచార హక్కు చట్టం కింద పంపిన ఉత్తరానికి 2021 జనవరిలో శశికళ విడుదలవుతారని జైలు సూపరింటెండెంట్ బదులిచ్చారు.

దీంతో శశికళ తరపున దినకరన్ తదితరులు ఇటీవలే కోర్టుకు రూ.10. కోట్ల జరిమానా చెల్లించారు. కర్ణాటక ప్రభుత్వ విధివిధానాలను అనుసరించి శశికళకు మొత్తం 129రోజులను సెలవులుగా ప్రకటించి విడుదల చేయాలని శశికళ తరఫు న్యాయవాది బెంగళూరు జైలు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించాడు.

అయితే శశికళ బయటకు రావడం బీజేపీకి ఇష్టం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు ‘గడువు కంటే ముందే శశికళ విడుదల అయ్యే అవకాశం లేదు. ఆమె పూర్తికాలం శిక్ష అనుభవించాల్సిందే’ అని కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని అంటున్నారు.

చిన్నమ్మ ఎంట్రీతో తమిళనాట రాజకీయాలు మారబోతున్నాయని ఊహాగానాలు ఉన్నాయి.అన్నా డీఎంకే చీలిపోతుందని.. ఆ పార్టీలోని కీలక నేతలంతా శశికళ వెనక నడుస్తారన్న విశ్లేషణలు మొదలయ్యాయి. కొందరైతే శశికళ తిరిగి అన్నాడీఎంకేను తన స్వాధీనంలోకి తెచ్చుకుంటుందని కూడా అంటున్నారు.

కాగా ప్రస్తుత తమిళనాడు సీఎం పళనిస్వామి డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. శశికళ వస్తే అన్నాడీఎంకేలో ఉన్న కీలకనేతలంతా శశికళకు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నది.

ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలను బీజేపీ పెద్దలు ఉద్దేశపూర్వకంగానే శశికళ ముందే విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి

అందుకే ఆ పార్టీకి చెందిన మంత్రి శశికళ విడుదలపై వ్యాఖ్యానించారని సమాచారం. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సి ఉంది. కాగా శశికళ ముందస్తు విడుదలకు అవకాశం లేదని కర్ణాటక మంత్రి స్పష్టం చేయడంతో ఆమె తరపు న్యాయవాదులు బెంగళూరు కోర్టును ఆశ్రయించనున్నారు.

శశికళను వెంటనే విడుదల చేయాలని కోరనున్నారు. రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారడంతో శశికళ విడుదలపై అభిమానులు అనుచరుల్లో ఆందోళన మొదలైంది.