Begin typing your search above and press return to search.

యాసిడ్ దాడిపై కీలక వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హైకోర్టు

By:  Tupaki Desk   |   27 July 2021 3:55 AM GMT
యాసిడ్ దాడిపై కీలక వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హైకోర్టు
X
నచ్చింది సొంతం కావాలి. కాదన్న వారి అంతు చూడాలన్న మైండ్ సెట్ కొందరికి ఉంటుంది. ఆడోళ్లను తమ చెప్పులుగా ఫీలయ్యే కొందరు పశువులు ఉంటారు. వారు కోరింది దక్కకుంటే చాలు.. దేనికైనా సిద్ధమంటూ దారుణ నేరాలకు పాల్పడతారు. అలాంటి వారిని మనుషులుగా భావించే కంటే.. మనసుషఉల రూపంలో ఉన్న పిచాశాలనటం సబబు. ఇలాంటి వారిపై తాజాగా కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్య చేసింది. తాము కన్నేసిన వారు కాదన్నంతనే క్రోధంతో వారిపై యాసిడ్ దాడికి పాల్పడే దుర్మార్గులపై కర్ణాటక రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి.

చిన్నారులు.. మహిళలపై యాసిడ్ దాడికి పాల్పడే దుర్మార్గులపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్య చేసింది. ఇలా చేయటం హత్య కంటే దారుణమైనదిగా పేర్కొంది. ఇలాంటి వారిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఒక టీచర్ పై యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తికి.. యావజ్జీవ కారాగార శిక్ష విధించిన జిల్లా కోర్టు తీర్పును తాజాగా కర్ణాటక హైకోర్టు సమర్థించింది. అంతేకాదు.. బాధితురాలిపై జరిగిన దాడి ఒక్క నేరం మాత్రమే కాదని.. మొత్తం నాగరిక సమాజం మీద చేసిన దాడిగా పేర్కొంది.

మహిళ ముఖంపై యాసిడ్ తో దాడి చేయటం కేవలం శారీరకంగా గాయపరిచినట్లే కాదని అది ఆమెను మానసికంగా కూడా తీవ్రమైన మానసిక వేదనకు గురి చేస్తుందని.. ఈ యాసిడ్ దాడుల్ని పేరెంట్స్.. భర్త.. పిల్లలు.. సమాజం ఏ మాత్రం సహించదని పేర్కొన్నారు. యాసిడ్ దాడులకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

కర్ణాటక హైకోర్టు ఇంత తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని దేవగిరి జిల్లాకు చెందిన హోన్నాళ్లికి చెందిన మహేశ్ అనే వ్యక్తి 2014లో బైక్ మీద వచ్చి ముఖం మీద యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దీనికి కారణం.. సదరు టీచర్ అతన్ని పెళ్లాడటానికి నో చెప్పటంతో.. అతడిలోని రాక్షసుడు నిద్ర లేచాడు. తన లాంటి మగాడు అడిగితే కాదని చెప్పటానికి ఎంత ధైర్యం అనుకున్నాడో ఏమోకానీ.. మరో ఆలోచన లేకుండా యాసిడ్ దాడికి పాల్పడ్డాడు.

ఈ కేసులో అతడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10 లక్షల జరిమానాను విధిస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. జిల్లా కోర్టు విధించిన శిక్షను తాజాగా హైకోర్టులో అప్పీలు చేశారు. అప్పీల్ సందర్భంగా కేసు విచారించిన హైకోర్టు.. జిల్లా కోర్టు తీర్పును ప్రస్తావించి.. అదే తీర్పును రిపీట్ చేయటం సంచలనంగా మారింది. తీర్పును చెప్పే క్రమంలో.. ఈ కేసును విచారణకు చేపట్టిన న్యాయస్థానం తీవ్రంగా కదిలిపోయింది. పిటిషనర్ కు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు సైతం నేరానికి పాల్పడిన వారికి పెద్ద పరీక్షనే ప్రతిపాదించటం గమనార్హం.