గూగుల్ మరో తప్పు.. సీనియర్ నటుడిని ‘హాఫ్ బాయిల్’ అంటూ..

Wed Jun 23 2021 22:00:02 GMT+0530 (IST)

Karnataka Fans Fires On Google India

ఆన్ లైన్లో సమాచారం కోసం అత్యధికంగా నెటిజన్లు ఆధారపడే సెర్చ్ ఇంజిన్ గూగుల్ మాత్రమే. ప్రపంచంలోని నెటిజన్లలో సుమారు 90 శాతం మంది గూగుల్ నే ఆశ్రయిస్తుంటారన్నది ఓ అంచనా. ఇంతటి ప్రాచుర్య పొందిన గూగుల్ నుంచి తరచూ పొరపాట్లు దొర్లుతున్నాయి. అప్పుడప్పుడూ కొన్ని పొరపాట్లతోపాటు అవాంఛనీయమైన ఫలితాలను చూపిస్తోంది.ఈ మధ్యనే భారతదేశంలో అత్యంత వికారమైన భాష (ugliest language in india) ఏదంటే.. కన్నడ భాష అని రిజల్ట్ చూపించింది. దీంతో.. కన్నడవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఘాటు కౌంటర్లు ఇచ్చారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సి వచ్చింది. లీగల్ నోటీసులు జారీచేస్తామని హెచ్చరించడంతో దిగివచ్చిన గూగుల్.. క్షమాపణలు చెప్పింది.

ఆ వివాదం సద్దుమణిగిందని అనుకుంటుండగానే.. మరో వివాదం మొదలైంది. ఇది కూడా కర్నాటకకు చెందినదే కావడం గమనార్హం. కన్నడ కంఠీరవగా కీర్తిపొందిన మహానటుడు రాజ్ కుమార్ ఫొటోపై ‘హాఫ్ బాయిల్’ అని రాసి ఉండడం కలకలం రేపింది. ఇది ఖచ్చితంగా గూగుల్ పొరపాటేనని రాజ్ కుమార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

గూగుల్ లో పొరపాట్లు రావడం ఇటీవల ఎక్కువైంది. ఆ మధ్య కేజీఎఫ్-2 లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నాడని కూడా గూగుల్ చూపించింది. దీనిపై గూగుల్ ప్రతినిధి స్పందిస్తూ.. గూగుల్ లో కనిపించే ప్రతీ సమాచారం గూగుల్ అభిప్రాయం కాదని ఇతరులు కూడా పోస్టు చేస్తుంటారని దీన్ని గుర్తించాలని కోరుతున్నారు.