Begin typing your search above and press return to search.

ఉప ఎన్నికలు: తెలుగు ప్రజలకూ - కన్నడీగులకూ ఎంత తేడా!

By:  Tupaki Desk   |   9 Dec 2019 2:30 PM GMT
ఉప ఎన్నికలు: తెలుగు ప్రజలకూ - కన్నడీగులకూ ఎంత తేడా!
X
రాజకీయ ఫిరాయింపుదారులను తెలుగు ప్రజలు ఏ మాత్రం క్షమించలేదు. ఇటీవలి లోక్ సభ - అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగునాట ఫిరాయింపుదారులను ప్రజలు తిరస్కరించారు. గత ఐదేళ్లలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటి అధికార పార్టీ తెలుగుదేశంలోకి 23 మంది ఎమ్మెల్యేలు - ఐదు మంది ఎంపీలు ఫిరాయించిన సంగతి తెలిసిందే. వారిలో చాలా మంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు.

అయితే అలాంటి వారిలో గెలిచింది ఒకరిద్దరే! ఫిరాయించి మంత్రి పదవులు తీసుకున్న వాళ్లు ఎన్నికల్లో చిత్తుగా ఓడారు. భూమా అఖిలప్రియ - సుజయ రంగారావు - ఆదినారాయణ రెడ్డి - అమర్ నాథ్ రెడ్డి వంటి మంత్రులతో పాటు.. ఫిరాయించి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్లు పొందిన వాళ్లలో చాలా మంది ఓటమి పాలయ్యారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి వంటి మారు మాత్రమే పిరాయించి కూడా నెగ్గగలిగారు.

ఇలా తెలుగునాట ఫిరాయింపు రాజకీయాల పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తబరిచారు. అయితే రాజకీయంగా అస్థిరమైన తీర్పులు ఇవ్వడంలో ఘనులు అయిన కన్నడీగులు మాత్రం ఫిరాయింపుదారులకు పెద్ద పీట వేశారు!

తాజాగా కర్ణాటక ఉప ఎన్నికల్లో నెగ్గిన వారంతా ఫిరాయింపుదారులే. వీరంతా కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపారు. ఆ ప్రభుత్వం కూలిపోయి, ఈ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అందుకు గానూ వీరు అనర్హత వేటుకు గురయ్యారు. వారికే బీజేపీ టికెట్లు ఇచ్చింది. వారినే ప్రజలు గెలిపించారు. ముగ్గురు ఫిరాయింపుదారులు తప్ప అందరినీ ప్రజలు గెలిపించారు.

అయితే ఏపీలో అధికార పార్టీలోకి అప్పట్లో ఫిరాయింపులు జరిగాయి, అయితే కర్ణాటకలో అధికార కూటమిపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. బహుశా ఆ తేడానే వీరిని గెలిపించిందేమో!