Begin typing your search above and press return to search.

కష్ట కాలంలో.. కపిల్ సిబల్ గుడ్ బై.. ఎస్పీ నుంచి ఎంపీగా పోటీ

By:  Tupaki Desk   |   25 May 2022 11:30 AM GMT
కష్ట కాలంలో.. కపిల్ సిబల్ గుడ్ బై.. ఎస్పీ నుంచి ఎంపీగా పోటీ
X
కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ నాయకత్వంపై రెండేళ్ల కిందట నిరసన గళం వ్యక్తం చేసిన జి-23 గ్రూప్ నేతల్లో సిబల్ కూడా ఒకరు. సీనియర్ న్యాయవాదిగా ఎంతో పేరు ప్రతిష్ఠలున్న ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున రాజ్య సభ సభ్యుడిగా ఉన్నారు. 2016లో యూపీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆయనను రాజ్యసభకు పంపింది.

ఈ ఏడాది జూలైతో ఆ పదవీ కాలం పూర్తవనుంది. ఈ నేపథ్యంలో ఆయనకు అనూహ్యంగా సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) మద్దతు దక్కింది. మూడు నెలల కిందటి ఎన్నికల్లో ఎస్పీ యూపీలో వందకు పైగా సీట్లను గెల్చుకున్నందున ఆయన ఆ పార్టీ నుంచి రాజ్య సభకు బుధవారం నామినేషన్ వేశారు. కాగా, ఇటీవల ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ కేవలం 2 సీట్లలో మాత్రమే గెలిచింది. దీంతో సిబల్ మళ్లీ రాజ్యసభకు వెళ్లాలంటే చాలా ప్రయత్నమే జరగాలి. ఇదంతా ఏమీ లేకుండా నేరుగా ఎస్పీ మద్దతు తెలపడంతో రాజ్యసభకు నామినేషన్ వేశారు.

ఆజాంఖాన్ ను విడిపించినందుకు ప్రతిఫలంగా..

యూపీలో ఎస్పీకి ఆజాంఖాన్ పెద్ద నాయకుడు. అయితే, ఆయనపై వందల కొద్దీ కేసులున్నాయి. ఆజాంఖాన్ తో పాటు ఆయన కుమారుడిపైనా పెద్దఎత్తున కేసులున్నాయి. దీంతో యూపీ ఫ్రభుత్వం వారిని చాలాకాలంగా జైల్లో ఉంచుతోంది. ఇటీవల ఎన్నికల్లోనూ ఆజాం జైల్లోంచే పోటీ చేశారు. కాగా, ఆజాంఖాన్ కు రెండేళ్ల కాలం తర్వాత ఇటీవల సుప్రీం కోర్టులో బెయిల్ లభించింది. దీంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన తరఫున సిబల్‌ వాదనలు వినిపించారు. దీనికి ప్రతిఫలంగానే సమాజ్‌వాదీ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిందని భావిస్తున్నారు. సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ సమక్షంలోనేసిబల్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. సీనియర్‌ లాయర్‌ అయిన కపిల్‌ సిబల్‌ పార్లమెంట్‌లో తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పగలరు.

వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ అభిప్రాయాలను కూడా పార్లమెంటులో వెల్లడిస్తారని ఆశిస్తున్నాం' అని ఎస్పీ పేర్కొంది. ఇక 'పార్లమెంట్‌లో స్వతంత్ర గళం ఉండడం ఎంతో ముఖ్యం.స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నప్పుడే ఎటువంటి రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదని మన గళాన్ని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్‌ దాఖలు చేశాను'అని కపిల్‌ సిబల్ పేర్కొన్నారు.

2జీలో పైసా పోలేదని వివాదం రేపారు

దేశాన్ని 2జీ కుంభకోణం ఎంతగా ఊపేసిందో అందరికీ తెలిసిందే. లక్ష కోట్ల స్కాంగా వార్తలు వచ్చిన ఈ స్కాంలో కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సైతం జైలుపాలయ్యారు. అయితే, 2011-13 మధ్య కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో సిబల్.. 2జీ స్పెక్ట్రమ్ స్కాం అనేది కేవలం ఊహాజనితమని.. అందులో రూపాయి కూడా పోలేదని వ్యాఖ్యానించి పెద్ద దుమారమే రేపారు.

మేధావి.. న్యాయవాది..

పంజాబ్ లోని జలంధర్ లో పుట్టిన సిబల్.. మేధావిగా పేరొందారు. న్యాయవాదిగా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. 73 ఏళ్ల సిబల్.. కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరు. 2013-14 మధ్య కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలోనే తెలంగాణ విభజన జరిగింది. 2011 నుంచి 2013 వరకు కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగానూ పనిచేశారు. ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో, హార్వర్డ్ లా స్కూల్ లో చదువుకున్న స్థాయి ఆయనది. సుప్రీం కోర్టులో ఎందరో ప్రముఖుల కేసులను వాదించిన అనుభవం ఆయనది. దీంతో దేశంలో రాం జెఠ్మలానీ తర్వాత ఆ స్థాయి న్యాయవాదిగా పేరొచ్చింది.

పార్టీ కష్ట కాలంలో ఉన్న వేళ..

వరుస పరాజయాలతో కుదేలవుతోన్న కాంగ్రెస్‌ పార్టీ సంస్కరణలకు సిద్ధమవుతోన్న వేళ.. ఆ పార్టీకి ఇది షాకే. పార్టీలో సంస్థాగత మార్పులపై పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ బహిరంగంగానే తన గళాన్ని వినిపించారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ రెబల్‌గా మారిన జీ-23 బృందంలోనూ కపిల్‌ సిబల్‌ ఉన్నారు. పార్టీ మొత్తం గాంధీ కుటుంబం చేతుల్లోనే ఉండడాన్నివ్యతిరేకిస్తోన్న ఆయన.. అధ్యక్షుడు కానప్పటికీ నిర్ణయాలన్నీ రాహుల్‌ గాంధీనే తీసుకుంటారని పలుసార్లు విమర్శించారు. ఇలా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కపిల్‌ సిబల్‌ చివరకు పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.