పొలిటికల్ బెట్టింగ్... టీడీపీ కార్యకర్త ప్రాణం తీసింది

Fri May 24 2019 20:07:05 GMT+0530 (IST)

Kantamneni Veerraju Who Placed 8 Lakh Bet Kills Self

రాజకీయ ఫలితాలపై పందేలు కాసిన వారు... ఫలితం తిరగబడితే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని కళ్లకు కడుతోంది ఈ ఘటన. తాను అభిమానించే పార్టీ గెలుస్తుందని లక్షలకు లక్షలు బెట్టింగ్ లో పెట్టిన ఓ వ్యక్తి చివరకు ఫలితం తిరగబడటంతో ప్రాణాలు తీసుకున్నాడు. పొలిటికల్ బెట్టింగులు మరింతగా జోరందుకుంటున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటగ డేంజర్ బెల్స్ ను మోగించిందనే చెప్పాలి. కోడి పందేలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త బలవన్మరణం చెందాడు.నిన్న ఫలితాలు వెలువడటం బెట్టింగ్ లో పెట్టిన రూ.12 లక్షలు పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తెలుగు తమ్ముడు నేటి ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లాలోని వెలివెన్నుకు చెందిన కంఠమనేని వీర్రాజు టీడీపీకి వీరాభిమాని. ఈ సారి కూడా టీడీపీనే అధికారంలోకి వస్తుందని ధీమాగా ఉన్నారు. అదే సమయంలో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలో టీడీపీకి ఏకంగా 110కి పైగా సీట్లు వస్తాయని చెప్పారు. దీంతో మరింత ధీమా కనబరచిన వీర్రాజు బెట్టింగుల్లో టీడీపీ వైపు రూ.12 లక్షల మేర పెట్టాడు.

అయితే నిన్న వెలువడిన ఫలితాల్లో టీడీపీ ఘోర పరాజయం పాలు కాగా... విపక్ష వైసీపీ బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. ఈ క్రమంలో టీడీపీ ఓడిపోవడంతో బెట్టింగుల్లో పెట్టిన రూ.12 లక్షలు పోయాయన్న బాధతో వీర్రాజు రాత్రి అంతా తీవ్ర మనోవేదనలోనూ కూరుకుపోయాడు. తెల్లారిన తర్వాత కూడా ఆ వేదన నుంచి బయటపడలేక.. పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు వెనువెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినా... అప్పటికే వీర్రాజు మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మొత్తంగా రాజకీయ పార్టీల గెలుపు ఓటముల మీద మొదలైన బెట్టింగులు ఈ ఎన్నికల్లో ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయన్న మాట.