కన్నా లక్ష్మినారాయణ ఔట్? ఎవరు ఇన్?

Wed Sep 11 2019 12:16:32 GMT+0530 (IST)

భారతీయ జనతా పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ మార్పుకు రంగం సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది. కన్నా స్థానంలో బీజేపీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు సన్నిహితుల్లో ఎవరో ఒకరు రాబోతున్నారని సమాచారం. భారతీయ జనతాపార్టీ ఏపీ విభాగం అధ్యక్ష స్థానంలో ఎవరున్నా.. వారు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వ్యవహరించడం ఆనవాయితీనే.ఈ క్రమంలో ఆ పార్టీలో మార్పు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి తరుణంలో కన్నా సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు అంటే ఏ మాత్రం పడని వ్యక్తి కన్నా. తనను చంపించడానికి కూడా గతంలో చంద్రబాబు నాయుడు ప్రయత్నించాడని కన్నా కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబుపై కన్నా తరచూ ధ్వజమెత్తుతూ ఉంటారు.  తాజాగా కూడా చంద్రబాబు మీద కన్నా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయనను జైలుకు పంపాలని అన్నారు.

ఇప్పటికే బీజేపీలో చంద్రబాబుకు చాలా మంది సన్నిహితులున్నారు. ఇటీవల మరికొంతమంది చేరారు కూడా. ఈ నేపథ్యంలో ఏపీ విభాగం అధ్యక్ష పగ్గాలు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులు అయిన వారికి దక్కే అవకాశాలున్నాయని భోగట్టా. కన్నాను త్వరలోనే పక్కన పెట్టేస్తారని - ఆ స్థానంలో చంద్రబాబు నాయుడి సన్నిహితుడు పగ్గాలు చేపడతారని సమాచారం. చంద్రబాబు నాయుడు సన్నిహితుడు బీజేపీ ఏపీ విభాగం అధినేతగా వస్తే.. అప్పుడు ఆ పార్టీ మరింతగా దెబ్బ తింటుందనే విశ్లేషణలు కూడా ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తూ ఉండటం గమనార్హం.  అయితే మార్పు మాత్రం కచ్చితంగా జరుగుతుందని వారు అనుకుంటున్నారు!