బాబుకు బీజేపీ డోర్లు క్లోజ్ అయిపోయాయ్..!

Wed Oct 16 2019 14:04:57 GMT+0530 (IST)

ఏపీలో వైసీపీని ఢీ కొట్టాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తన బలం సరిపోదన్న విషయం చంద్రబాబుకు అర్థమైనట్టు ఉంది. అందుకే ఆయన తాజాగా కేంద్రంతో విబేధించి నష్టపోయామంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఏ మాత్రం అవకాశం ఉన్న మళ్లీ బీజేపీతో కలిసి పనిచేసేందుకు బాబు ఎప్పుడు రెడీగానే ఉంటారు. ఆయన బీజేపీతో అవసరానికి కలవడం.. ఆ తర్వాత బయటకు రావడం కామనే. అయితే గతంలో పరిస్థితులకు... ఇప్పటి పరిస్థితులకు తేడా ఉండడంతో బాబు ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయన్న సందేహాలు ఉన్నాయ్.ఇదిలా ఉంటే బాబుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కాస్త స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆయన కర్నూలులో గాంధీ సంకల్పయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగానే కన్నా  కేంద్ర ప్రభుత్వంతో వైరం పెట్టుకోవడం వల్లే మొన్నటి ఎన్నికల్లో తాము ఓడిపోయామని బాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. చంద్రబాబు పెద్ద అవకాశ వాదని... ఆయన ఎప్పుడు ఏం ?  మాట్లాడతారో కూడా ఆయనకే తెలియదని కన్నా ఎద్దేవా చేశారు.

ఇక గతంలో చంద్రబాబు బీజేపీని ఎలా వాడుకున్నారో కూడా కన్నా చెప్పారు. 1999లో వాజ్ పేయ్ ఇమేజ్ వాడుకుని గెలిచిన బాబు....తమ పార్టీని సమాధి చేశారని మండిపడ్డారు. ఇక 2014లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని.. పార్టీని ఏపీలోనే శాశ్వతంగా లేకుండా చేయాలని కుట్ర చేశారని విమర్శించారు. ఇక ప్రస్తుతం ఏపీలో బీజేపీ చిగురిస్తుండడంతో మళ్లీ బాబు కొత్త ప్లాన్ వేసి ఇక్కడ మళ్లీ బీజేపీని ఎదగనీయకుండా చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రతిసారి చంద్రబాబు చేతిలో మోసపోయేందుకు బీజేపీ సిద్ధంగా లేదని... ఆయనకు బీజేపీ శాశ్వతంగా తలుపులు మూసేసిందన్న విషయం నరసారావుపేటలో అమిత్ షా కూడా చెప్పారని కన్నా ప్రస్తావించారు. ఇక ఏపీ అభివృద్ది చెందుతుందన్న ఆశ కూడా తనకు లేదని... ఇక్కడ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా అభివృద్ధి సంక్షేమం కలగా మిగిలిపోయే పరిస్థితి ఉందని అన్నారు.