కమల్ పార్టీకి.. ప్రముఖ నటుడి భార్య గుడ్ బై!

Thu Apr 22 2021 13:05:44 GMT+0530 (IST)

Kameela Nasar Says Good Bye To Kamal Party

కమల్ హాసన్ పార్టీకి ‘మక్కల్ నీదిమయ్యం’ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి ప్రముఖ నటుడు నాజర్ భార్య కమీలా నాజర్ రాజీనామా చేసినట్టు సమాచారం. తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపించారట. అయితే.. ఆమె రాజీనామాకు అసంతృప్తే కారణమని తెలుస్తోంది.కమల్ పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే చేరిన కమీలాను చెన్నై జోన్ కార్యదర్శిగా నియమించారు కమల్. ఆ తర్వాత వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో మక్కల్ నీదిమయ్యం పార్టీ తరపున సౌత్ చెన్నై నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు కమీలా నాజర్. కానీ.. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు.

ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. ఆమెకు టికెట్ దక్కలేదు. దీంతో.. కమీలా తీవ్ర అసంతృప్తికి లోనైనట్టు సమాచారం. ఈ ఆవేదనతోనే ఆమె పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే.. రాజీనామా లేఖలో మాత్రం వ్యక్తిగత కారణాలతో వైదొలుగుతున్నట్టు పేర్కొన్నారట. కాగా.. ఆమె రాజీనామాను ఆమోదించినట్టు పార్టీ కార్యాలయ కార్యదర్శి సంతోష్ బాబు వెల్లడించినట్టు సమాచారం.