Begin typing your search above and press return to search.

'ఆకలి'రాజ్యంలో 'చావు'కేకలు వినపడడం లేదా మోడీ?

By:  Tupaki Desk   |   6 April 2020 2:40 PM GMT
ఆకలిరాజ్యంలో చావుకేకలు వినపడడం లేదా మోడీ?
X
కరోనా కట్టడికి భారత్ లో విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌ నిర్ణయంపై కొందరు విమర్శలు గుప్పించగా...ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలువురు ప్రశంసలు గుప్పించారు. సరైన సమయంలో మోడీ లాక్ డౌన్ విధించడం వల్లే భారత్ లో కరోనా స్టేజి 3లోకి వెళ్లలేదని...కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ దశలోకి మన దేశం వెళ్లకుండా లాక్ డౌన్ ప్రభావవంతంగా పనిచేసిందని పలువురు అంటున్నారు. మన దేశంలో జనవరి 30నే కరోనా తొలికేసు నమోదైందని, అప్పటి అంతర్జాతీయ విమానాలను నిలిపివేయడం..విదేశాల నుంచి వచ్చిన వారిపై కఠినంగా క్వారంటైన్ అమలు చేయడం వంటివి చేసుంటే లాక్ డౌన్ అవసరమే వచ్చేది కాదని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇక, తాజాగా లాక్ డౌన్ నిర్ణయంపై సినీనటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్ విమర్శలు గుప్పించారు.

ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం వల్ల పేదలు, అణగారిన వర్గాలు, వలస కార్మికులు, దినసరి కూలీలు తీవ్రంగా నష్టపోయారని కమల్ అన్నారు. డీమానిటైజేషన్ మాదిరిగా ఈసారి కూడా ప్రధాని మోదీ ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. నోట్ల రద్దు సమయం లో కూడా పేదలే నష్టపోయారని గుర్తుచేశారు. అయితే, కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వల్ల మధ్య తరగతితోపాటు కొన్ని వర్గాల వారికే ఉపశమనం కలుగుతోందని, అలా కాకుండా మిగతా అన్ని వర్గాలను కేంద్రం ఆదుకోవాలని కమల్ అన్నారు. లాక్ డౌన్ ప్రభావం దేశ జీడీపీ మీద తీవ్రంగా పడుతుందన్న కమల్...ప్రధానికి ఓ బహిరంగ లేఖ రాశారు. నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించినప్పుడు అది కరెక్ట్ అని తాను నమ్మానని, నమ్మడం తప్పు అని తనకు తర్వాత తెలిసిందని కమల్ అన్నారు.

ఇప్పుడు కూడా హఠాత్తుగా లాక్ డౌన్ విధించి...4 గంటల్లో ఎక్కడి వారు అక్కడే ఉండాలన్న మోడీ నిర్ణయం తప్పని కాలం నిరూపించిందని కమల్ విమర్శించారు.మోడీ విజన్ మరోసారి ఫెయిల్ అయిందన్న కమల్...కరోనా కట్టడికి మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వ్యవహరిస్తున్న తీరును విమర్శించారు. కేవంత మధ్య తరగతి వారిని ఆదుకుంటే సరిపోదని....అణగారిన వర్గాలు....ఆటో రిక్షా డ్రైవర్లు, శ్రామికులు, కర్షకులు, వలస కూలీలు, దినసరి కార్మికులు, రోజువారి వేతన జీవులు, ఆ రోజు పనికి వెళ్లకపోతే పస్తు పడుకోవాల్సిన పరిస్థితులున్న కుటుంబాలు, అనాథలు, అభాగ్యులు...వీరందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వానిదేనని , ఆ విషయంలో మోడీ ఫెయిల్ అయ్యారని కమల్ అన్నారు. లాక్ డౌన్ విధించడం వల్ల ఏ ఒక్కరూ పస్తు పడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని కమల్ విమర్శించారు.

లాక్ డౌన్ అనాలోచితంగా విధించడం వల్లే ఇన్ని ఇబ్బందులు వచ్చాయని, కరోనా వ్యాప్తి చెందుతున్న తొలినాళ్లలో మోడీ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతోనే నేడు ఈ దుస్థితి వచ్చిందని అన్నారు. కరోనాను కొన్నాళ్లకు కట్టడి చేస్తామని...కానీ, దాని వల్ల కలిగిన దుష్పరిణామాల ప్రభావం చాలా కాలం ఉంటుందని....ఎన్నో జీవితాలు అతలాకుతలమవుతున్నాయని...వాటిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. ఇంటలెక్చువల్ అన్న పదం మోడీకి నచ్చదని...కానీ, తాను పెరియార్, గాంధీల స్ఫూర్తితో జీవితం గడుపుతున్నానని....కాబట్టి ఆ పదం వాడాల్సి వచ్చిందని అన్నారు. తాను తీసుకోబోయే నిర్ణయాల పర్యవసానాలకూ ప్రణాళికలు సిద్ధం చేసినవాడే అసలైన నాయకుడని...గాంధీ, పెరియార్ లు అటువంటి నాయకులని కమల్ గుర్తు చేశారు.

మోడీకి గొప్ప ఫాలోయింగ్ ఉందని....ఆయన చెబితే 130 కోట్ల మంది ప్రజలు చప్పట్లు కొట్టారని...దీపాలు వెలిగించారని అన్న కమల్....అదే దీపాలను అన్ని వర్గాల వారి జీవితాల్లో వెలగించేలా మోడీ చర్యలు చేపట్టాలని కోరారు. ఒకవైపు ధనికులు ఆ దీపాల్లో నూనె పోస్తుంటే...మరోవైపు రొట్టెలు కాల్చుకోవడానికి నూనె లేక...తమ చీకటి బతుకుల్లో ఆకలి వెలుగులు ఎప్పుడు వస్తాయో తెలియక బిక్కు బిక్కుమంటూ కొందరు బ్రతుకీడుస్తున్నారని కమల్ ఆవేదన వ్యక్తం చేశారు. 'ఆకలి' రాజ్యంలో 'చావు'కేకలు వినాలని...ఆకలి చావులు లేకుండా చూడాలని కమల్ కోరారు. ప్రధాని మోడీపై తామంతా కోపంగా ఉన్నామని...అయినప్పటికీ ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రధాని వెంటే ఉన్నామని కమల్ చెప్పారు. తన ప్రజలకు తాను ఒక నాయకుడిగా ఉన్నాను కాబట్టి మోడీ ఆలోచనలను ప్రశ్నించానని, ఏమైనా అమర్యాదపరిచి ఉంటే దయచేసి క్షమించంలంటూ మోడీని కోరుతూ కమల్ లేఖ రాశారు.