కాంగ్రెస్ కు మరో మరక.. సీఎం మేనల్లుడు అరెస్ట్!

Tue Aug 20 2019 13:03:01 GMT+0530 (IST)

Kamal Nath Nephew Ratul Puri Arrested by ED in Bank Fraud Case

కేంద్రంలో అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ పై అవినీతి మరకలు కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని దుర్వినియోగం చేసిన వ్యవహారంలో కమల్ నాథ్ మేనల్లుడు రతుల్ పురిని అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. సీడీలు - డీవీడీ మేకింగ్ సంస్థ మొజర్ బేర్ గురించి సినీ ప్రియులందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంస్థకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న సమయంలో రతుల్ పురి వ్యవహరించిన తీరుపై కేసులు నమోదు అయ్యాయి. వాటి మేరకు ఇప్పుడు అరెస్టు జరిగింది.వివిధ బ్యాంకుల నుంచి రతుల్ పురి మొజర్ బేర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నప్పుడు భారీగా అప్పులు తీసుకున్నట్టుగా తెలస్తోంది. ఆ అప్పులను చెల్లించడంలో విఫలం అయ్యారు. దీంతో విచారణ మొదలైంది. బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బును దుర్వినియోగం చేసినట్టుగా తేలింది. అయితే కొన్నేళ్ల కిందట రతుల్ పురి ఆ హోదాకు రాజీనామా చేశారు. అయితే అప్పులు తీసుకున్నది అతడు ఆ హోదాలో ఉన్నప్పుడే కావడంతో ఈడీ ఆయనను  అరెస్టు చేసింది.

ఇతర అవినీతి వ్యవహారాలు ఎలా ఉన్నా.. బ్యాంకుల నుంచి లోన్లను తీసుకుని ఎగ్గొట్టే వ్యవహారాలను మాత్రం జనాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున దేశంలో ఉన్న తక్కువమంది సీఎంలలో ఒకరైన కమల్ నాథ్ మేనల్లుడు  ఇలా అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది.